మనుషులు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో తెలుసా?
- స్థిరమైన ప్రవర్తనే నమ్మకానికి ఆధారం
- మాటలు, చేతలు ఒకేలా ఉండాలి
- చిన్న హామీలు కూడా నిలబెట్టుకోవాలి
- తప్పులను నిజాయతీగా అంగీకరించాలి
- భావోద్వేగాలపై నియంత్రణ అవసరం
తెలివి కాదు..
చాలామంది నమ్మకం సంపాదించాలంటే తెలివిగా ఉండాలని భావిస్తారు. ఇంకొందరు ఆత్మవిశ్వాసం లేదా ఆకట్టుకునే వ్యక్తిత్వమే కారణమని అనుకుంటారు. కానీ సైకాలజీ నిపుణుల అభిప్రాయం వేరేలా ఉంది. ఒక వ్యక్తి మాటకు కట్టుబడి ఉండటం, ప్రవర్తనలో స్థిరత్వం చూపించడం నమ్మకాన్ని పెంచే ప్రధాన అంశమని చెబుతున్నారు.
చెప్పింది చేస్తేనే
మనకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. వారు తప్పనిసరిగా అత్యంత తెలివైనవారే కావాల్సిన అవసరం లేదు. కానీ చెప్పిన మాట నిలబెట్టుకుంటారు. సహాయం చేస్తానంటే చేస్తారు. వస్తానంటే వస్తారు. వారి ప్రవర్తనలో స్థిరత్వం ఉండటం వల్లే వారిపై విశ్వాసం పెరుగుతుంది.
మెదడు అంచనా ఇదే
ఎదుటి వ్యక్తిని కలిసిన ప్రతిసారీ మన మెదడు ఒక ప్రశ్న వేసుకుంటుంది. ‘‘ఈ వ్యక్తిని నమ్మవచ్చా?’’ అని. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో స్థిరమైన ప్రవర్తన కీలకంగా మారుతుంది. ఒకరోజు ఒకలా, మరో రోజు మరోలా ప్రవర్తించే వారిని అర్థం చేసుకోవడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో నమ్మకం ఏర్పడటానికి ఎక్కువ సమయం పడుతుంది.
చిన్న చిన్న పనులే
నమ్మకం ఒక్కరోజులో ఏర్పడదు. అది చిన్న చిన్న చర్యలతో పెరుగుతుంది. సమయానికి రావడం, ఇచ్చిన హామీలను నెరవేర్చడం, బాధ్యతగా వ్యవహరించడం వంటి విషయాలు ఎదుటివారికి భరోసా కలిగిస్తాయి. ఈ వ్యక్తిపై ఆధారపడొచ్చనే భావన క్రమంగా బలపడుతుంది.
తప్పులు చేసినా సమస్య కాదు
చాలామంది నమ్మకం పొందాలంటే ఎప్పుడూ తప్పులు చేయకూడదని అనుకుంటారు. కానీ పరిశోధనలు వేరే విషయాన్ని చెబుతున్నాయి. పొరపాటు జరిగినా దాన్ని నిజాయతీగా అంగీకరిస్తే చాలా మంది క్షమిస్తారు. కానీ ఒకటి చెప్పి మరొకటి చేయడం మాత్రం నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.
రెండు ముఖాలు
బయట ఒకలా, వ్యక్తిగతంగా మరోలా ప్రవర్తించే వారిపై అనుమానాలు పెరుగుతాయి. నిజాయతీ గురించి మాట్లాడుతూనే అబద్ధాలు చెప్పడం కూడా అదే ప్రభావం చూపుతుంది. మాటలు, చేతలు ఒకే దారిలో లేకపోతే విశ్వాసం క్రమంగా తగ్గిపోతుంది.
భావోద్వేగాలపై నియంత్రణ
ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందించే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలామందికి అసౌకర్యంగా ఉంటుంది. కానీ పరిస్థితులకు తగ్గట్టు ప్రశాంతంగా స్పందించే వారితో తమ ఆలోచనలు పంచుకోవడానికి ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇదీ నమ్మకాన్ని పెంచే మరో అంశమే.
నిజమైన వ్యక్తిత్వానికి అదే గుర్తు
వ్యక్తి విలువలు, మాటలు, పనులు ఒకే దిశలో ఉంటే దాన్ని సమగ్రతగా భావిస్తారు. అలాంటి వారిని ప్రజలు సహజంగా విశ్వసిస్తారు. సోషల్ మీడియా యుగంలో ఆకర్షణీయమైన ఇమేజ్ సృష్టించడం సులభమే. కానీ దీర్ఘకాలంలో ప్రజలు గమనించేది ప్రవర్తనలోని స్థిరత్వాన్నే.