తుపాకితో బెదిరించి కోడలిపై మామ అత్యాచారం.. ఫోన్‌లో భర్త ట్రిపుల్ తలాక్!

Bahraich crime woman raped by father in law and divorced by husband via Triple Talaq
  • యూపీలోని బహ్రయిచ్ కోడలిపై మామ పలుమార్లు అత్యాచారం
  • తుపాకితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఆరోపణ
  • విషయం చెప్పడంతో ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి వదిలించుకున్న భర్త
  • అత్తమామలు దాడి చేయడంతో పుట్టింటికి చేరిన బాధితురాలు
  • భర్త, మామ సహా ఐదుగురిపై ట్రిపుల్ తలాక్ చట్టం కింద కేసు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. అండగా నిలవాల్సిన మామ అఘాయిత్యానికి పాల్పడగా, ఆ అన్యాయం గురించి భర్తకు చెప్పుకుంటే అతడు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి బంధాన్ని తెంచుకున్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, మామ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

లక్నోకు చెందిన ఓ మహిళకు 2023లో బహ్రయిచ్ నివాసితో ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహమైంది. రెండేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే, భర్త ఉద్యోగరీత్యా బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న కోడలిపై మామ కన్నేశాడు. తుపాకితో బెదిరించి, చంపేస్తానని భయపెట్టి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. చివరిగా ఈ ఏడాది జనవరి 24న కూడా లైంగిక దాడి చేయడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది.

ఆమె అరుపులు విని వచ్చిన అత్త, ఆడపడుచు, బావ.. ఆమెను కాపాడాల్సింది పోయి, ఎదురు దాడికి దిగి తీవ్రంగా కొట్టారు. ఈ విషయాన్ని ఫోన్‌లో భర్తకు చెప్పగా, ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని అతడు కూడా బెదిరించాడు. ఈ నరకాన్ని భరించలేక బాధితురాలు లక్నోలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త ఫోన్ చేసి, మూడుసార్లు 'తలాక్' చెప్పి విడాకులు ఇచ్చాడు.

ఈ ఘటనపై రూపైదేహా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రమేశ్ కుమార్ రావత్ స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భర్త, మామ, అత్త, ఆడపడుచు, బావపై భారతీయ న్యాయ సంహిత (BNS), ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం-2019 (ట్రిపుల్ తలాక్ నిషేధ చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే, ఈ ఆరోపణలపై పోలీసులు భర్తను ప్రశ్నించగా, తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందని, అందుకే కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, సమగ్ర దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Triple Talaq Case
Bahraich Uttar Pradesh
Father in law rape
Muslim Women Protection Act
Rupaidiha Police Station
Uttar Pradesh Crime News

More Telugu News