మోదీ పాలనలో నూతన మధ్యతరగతి ఆవిర్భావం.. భారీగా తగ్గిన పేదరికం
- ఎన్డీయే 12 ఏళ్ల పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్న మోదీ
- భారత్లో తీవ్ర పేదరికం 2.3 శాతానికి పడిపోయిందని ప్రపంచ బ్యాంకు నివేదిక
- రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య
- ఈ నూతన మధ్యతరగతి మళ్లీ పేదరికంలోకి జారకుండా చూడాలని మోదీ పిలుపు
బుధవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఎన్డీయే ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడటమే మా విధానాలు, దిశ సరైనవని నిరూపిస్తోంది. ఈ విజయం ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతుంది" అని అన్నారు.
పేదరికంపై భారత్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ బ్యాంకు తన స్ప్రింగ్ 2025 నివేదికలో ప్రశంసించింది. ఈ నివేదిక ప్రకారం, రోజుకు 2.15 డాలర్ల కన్నా తక్కువ ఆదాయంతో జీవించే తీవ్ర పేదల సంఖ్య 2011-12లో 16.2% ఉండగా, 2022-23 నాటికి కేవలం 2.3%కి పడిపోయింది. అంతకుముందు నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక కూడా, 2015-16 నుంచి 2019-21 మధ్యకాలంలో సుమారు 13.55 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది.
మోదీ ప్రభుత్వం పన్నువిధానాలు, వైద్యం, విద్య, మౌలిక వసతులు అనే నాలుగు స్తంభాలపై దృష్టి సారించడం ఈ వృద్ధికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సరళీకరించిన పన్ను విధానాల వల్ల పౌరులపై భారం తగ్గింది. ఫలితంగా, 2013-14లో 5.26 కోట్లుగా ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య, 2024-25 నాటికి 12.13 కోట్లకు పెరిగింది.
"పేదరికం నుంచి బయటపడి, నేడు నూతన మధ్యతరగతి వర్గంగా మారిన వారు మళ్లీ వెనక్కి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.