వైసీపీ ‘శవ రాజకీయాలు’ చేస్తోంది: మంత్రి నారాయణ
- విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్న నారాయణ
- సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్ ఘటనను పర్యవేక్షిస్తున్నారని వెల్లడి
- 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారని హెచ్చరిక
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించిందని మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి గ్రీవెన్స్ సెల్‌లో పాల్గొన్న ఆయన, ఈ ప్రమాదం నేపథ్యంలో తాను తిరుపతిలో పాల్గొనాల్సిన అధికారిక కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం, తక్షణ సహాయక చర్యలు అందించడంపైనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. అయితే, ఈ విషాదాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ దారుణమైన శవ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికిన ఆయన, 2029 ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు మళ్లీ తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఇక గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన 56 ఫిర్యాదుల్లో 60 శాతానికి పైగా రెవెన్యూ సమస్యలే ఉన్నాయని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల వల్లే ప్రజలు నేటికీ ఇబ్బందులు పడుతున్నారని, వీటి పరిష్కారానికి మంత్రుల కమిటీ పనిచేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు వారానికోసారి దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నారని, వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు.