‘‘దీదీ మారిపోయారు’’.. తృణమూల్ రెబెల్‌ ఎంపీ శతాబ్ది రాయ్ సంచలన వ్యాఖ్యలు!

  • ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందో వివరించిన శతాబ్ది రాయ్‌
  • అధినాయకత్వాన్ని కలిసే అవకాశం ఉండేది కాదని ఆరోపణ
  • పార్టీలో అవినీతి పెరిగినట్లు వెల్లడి
  • ఎంపీల గొంతు నొక్కారని విమర్శ
  • ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థన
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో రేగిన తిరుగుబాటు జ్వాలలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు అధికార ఎన్‌డీయే కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ తిరుగుబాటు గ్రూప్‌నకు డిప్యూటీ లీడర్‌గా ఎన్నికైన ప్రముఖ బెంగాలీ నటి, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్ ఈ సంక్షోభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 నుంచి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థురాలిగా ఉన్న ఆమె.. తాము పార్టీని వీడటానికి గల అసలు కారణాలను ‘ఎన్‌డీటీవీ’ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘గత కొన్నేళ్లుగా దీదీ చాలా మారిపోయారు’’ అని శతాబ్ది రాయ్ వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీతో తనకు ఇప్పటికీ బలమైన బంధం ఉందని, అయితే అంతకంటే ప్రజా పనులే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గతంగా పెరిగిపోయిన అవినీతి, నాయకత్వానికి-ప్రజాప్రతినిధులకు మధ్య పెరిగిన దూరం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

పార్టీలో కేవలం కొంతమంది ఎంపిక చేసిన నేతలకు మాత్రమే మమతా బెనర్జీని కలిసే అవకాశం ఉండేదని శతాబ్ది రాయ్ ఆరోపించారు. మిగిలిన ఎంపీలు, సీనియర్ల గళాన్ని పూర్తిగా నొక్కేశారని, కనీసం తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకుందామన్నా అధిష్ఠానం వినే పరిస్థితి లేదని మండిపడ్డారు. బెంగాల్ ప్రభుత్వంలోని మంత్రులు కూడా ఎంపీలకు అపాయింట్‌మెంట్లు ఇచ్చేవారు కాదన్నారు. ఎలాంటి నిర్ణయాల్లోనూ ఎంపీలను సంప్రదించేవారు కాదని, ఏమైనా మాట్లాడాలని చూస్తే ‘నోరు మూసుకుని కూర్చోండి’ అని ఆరోపించారు.

మరోవైపు తృణమూల్ కాంగ్రెస్‌లో అవినీతి పరాకాష్ఠకు చేరిందని శతాబ్ది రాయ్ ఆరోపించారు. అయితే తనపై ఎలాంటి అవినీతి మరకలు లేవని, ఇమేజ్ క్లీన్ చేసుకోవడానికి తానేమీ పార్టీలు మారడం లేదని, కేవలం ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు. పార్టీ బలహీనంగా ఉన్న సమయంలోనే ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘ఇప్పుడే మాకు అన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎలా ప్రవర్తించిందో చూశాం. నా నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు కోసమే ఇప్పుడు ఈ అడుగు వేశాను’’ అని స్పష్టం చేశారు. 

Shatabdi Roy
Mamata Banerjee
Trinamool Congress
TMC Rebellion
West Bengal Politics
NDA Support

More Telugu News