గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

  • రూ. 4.77 కోట్ల అభివృద్ధి పనులకు వెనిగండ్ల రాము శంకుస్థాపన
  • ప్రజలకు సురక్షితమై త్రాగునీరు అందించడమే తమ ధ్యేయమని వ్యాఖ్య
  • గతంలో నిర్లక్ష్యానికి గురైన పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని వెల్లడి

కృష్ణా జిల్లా గుడివాడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పట్టణ అభివృద్ధిపై వస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దీటుగా స్పందించారు. గుడివాడ అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు.


గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.4.77 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రత్యర్థి పార్టీ చేస్తున్న నిరాధార విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తాము కూడా వాటిని లెక్కచేయబోమని తేల్చిచెప్పారు.


గుడివాడ ప్రజలకు దీర్ఘకాలికంగా సురక్షితమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో 35 వేల కుటుంబాలు ఉండగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 55 వేల కుటుంబాలకు సరిపడా నీరు అందేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సంపు పూర్తయితే హెడ్ వాటర్ వర్క్స్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని ఆయన వివరించారు.


గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పనులన్నింటినీ ఇప్పుడు వేగంగా పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. తాము కేవలం అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి కేంద్రీకరించామని, వ్యక్తిగత విమర్శలకు స్పందించాల్సిన అవసరం తమకు లేదని వెనిగండ్ల రాము కొట్టిపారేశారు.


Venigandla Ramu
Gudivada MLA
Gudivada Head Water Works
Andhra Pradesh Politics
Gudivada Development
Krishna District News
Drinking Water Projects
Public Debate Challenge
Central Government Funds
Alliance Government AP

More Telugu News