ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!

IMD Shocking Alert Less Than 90 Percent Rainfall This Time
  • పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో 
  • ఈ ఏడాది సగటు కంటే 90 శాతం తక్కువ వర్షపాతం!
  • దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలహీనమైన వర్ష సూచన
  • కేరళలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ప్రవేశం
  • మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు!
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యవసాయ రంగానికి పట్టుకొమ్మ లాంటి నైరుతి రుతుపవనాల (Southwest monsoon)పై పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న 'ఎల్ నినో' (El Niño) తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన రుతుపవనాల అంచనాలను ఐఎండీ సవరించింది. ఈ ఏడాది దీర్ఘకాలిక సగటు వర్షపాతం (LPA)లో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని, అంటే సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. గత పదేళ్ల కాలంలో దేశంలోనే అత్యంత బలహీనమైన వర్ష సూచన ఇదే కావడం గమనార్హం.

ఈసారి నైరుతి రుతుపవనాలు జూన్ 4న ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. దేశవ్యాప్తంగా 70 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తూ, కోట్ల మంది రైతుల జీవనాధారంగా ఉన్న రుతుపవనాలు బలహీనపడటం వ్యవసాయ రంగంతో పాటు ఆహార భద్రత, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడాన్ని 'ఎల్ నినో' గా పిలుస్తారు. దీనివల్ల వాతావరణ వ్యవస్థ దెబ్బతిని, భారత ఉపఖండం వైపు వచ్చే రుతుపవన గాలులు బలహీనపడతాయి. జూన్ - ఆగస్టు 2026 మధ్య ఎల్ నినో ఏర్పడే అవకాశం 80 శాతం ఉండగా, నవంబర్ నాటికి అది 90 శాతానికి పెరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కూడా ధ్రువీకరించింది.

ప్రాంతీయ ప్రభావాలు - పంటలపై ముప్పు
ఐఎండీ అంచనాల ప్రకారం.. దేశంలోని మధ్య, దక్షిణ భారత (పెనిన్సులర్) ప్రాంతాలలో వర్షాలు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే వాయవ్య (Northwest) ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవచ్చు. ఎల్ నినో వచ్చిన ప్రతిసారీ తీవ్ర కరవు రాకపోయినప్పటికీ, చారిత్రక రికార్డుల ప్రకారం వర్షపాతం గణనీయంగా తగ్గుతుంది. దీనివల్ల ఖరీఫ్ సీజన్ ప్రధాన పంటలైన వరి, పప్పుధాన్యాల సాగు ఆలస్యం కావడమే కాకుండా, దిగుబడి తగ్గి మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరిగే ద్రవ్యోల్బణ (Inflation) ముప్పు పొంచి ఉంది.

ఆశలు రేపుతున్న ఐవోడీ
గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిన లా నినా (La Niña) పరిస్థితులు ముగిసి, భూతాపం (Climate change) కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. అయితే, హిందూ మహాసముద్రంలో ఏర్పడే 'పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్' (IOD) కాస్త బలంగా ఉంటే.. అది ఎల్ నినో ప్రభావాన్ని కొంతవరకు అడ్డుకుని వర్షాలు కురిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ దీని తీవ్రతపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Go Back to Shorts
IMD
El Nino
Southwest Monsoon 2026
Rainfall Forecast India
Indian Meteorological Department
Indian Agriculture Impact
Indian Ocean Dipole
Below Average Rainfall
Climate Change India
Monsoon Weather Update

More Telugu News