Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కువైట్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఇలా పడింది... వీడియో వైరల్!

Video Shows Moment Drone Hit Kuwait Airport
Advertisement
  • కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి
  • దాడి దృశ్యాలను విడుదల చేసిన కువైట్ ప్రభుత్వం
  • ఇరాన్ దాడి చేసిందన్న కువైట్, ఆరోపణలను ఖండించిన ఇరాన్
Advertisement
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నిన్న డ్రోన్ దాడితో దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1పైకి దూసుకొచ్చిన ఓ డ్రోన్ భారీ పేలుడుకు కారణమైంది. ఈ ఘటనలో ఒక భారతీయ పౌరుడు మరణించగా, ప్రయాణికులు, సిబ్బంది సహా 63 మందికి పైగా గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే టెర్మినల్ భవనం నిప్పుల గోళంగా మారి, పైకప్పు కొంతభాగం కూలిపోయింది. ఈ భయానక దృశ్యాలు సర్వైలెన్స్ వీడియోలో రికార్డ్ అయ్యాయి.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడికి సంబంధించిన సర్వైలెన్స్ ఫుటేజీని ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ దాడిని 'ఇరాన్ నేరపూరిత దురాక్రమణ'గా కువైట్ తీవ్రంగా ఖండించింది. కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ వీడియోను 'ఎక్స్' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది. జూన్ 3న టెర్మినల్ 1పై జరిగిన ఈ దాడి దృశ్యాలను పంచుకుంది. వీడియోలో, డ్రోన్ భవనాన్ని ఢీకొట్టిన వెంటనే టెర్మినల్ పైకప్పు కూలిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడి వల్ల ప్రాణ నష్టంతో పాటు, తీవ్ర గాయాలు, భారీ ఆస్తి నష్టం జరిగిందని పేర్కొంది.

పలు శత్రు డ్రోన్లు తమ పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నాయని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మండిపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దాడి కారణంగా ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేసి, ఇతర టెర్మినల్స్ నుంచి విమాన రాకపోకలను పునరుద్ధరించారు.

అయితే, ఈ ఆరోపణలను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా ఖండించింది. కువైట్ విమానాశ్రయాన్ని తాము లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకునే ప్రయత్నంలో విఫలమైన అమెరికాకు చెందిన పేట్రియాట్ క్షిపణి పనిచేయకపోవడం వల్లే కూలిపోయిందని, దానివల్లే నష్టం జరిగిందని ఇరాన్ ప్రతివాదన చేస్తోంది. ఇరాన్ వాదనను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన దాడేనని పేర్కొంది. ఈ దాడితో ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తీవ్ర విఘాతం కలిగినట్లయింది.
Advertisement
Advertisement
Video Shows Moment Drone Hit Kuwait Airport
Ball Of Fire Roof Collapse

More Telugu News