నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా 'పెద్ది' దగ్గరే ఉంది: చిరంజీవి
- నేడు పెద్ది గ్రాండ్ రిలీజ్
- సోషల్ మీడియా వేదికగా స్పందించిన మెగాస్టార్
- చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఆనందం
- పెద్ది యూనిట్ కు పేరుపేరునా అభినందనలు తెలిపిన వైనం
"నా ప్రియమైన రామ్ చరణ్ కు, మా 'పెద్ది' చిత్ర బృందానికి ఈ అద్భుతమైన బ్లాక్‌బస్టర్ విజయంపై నా అభినందనలు. నేను వృత్తిపరంగా షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ, నా మనసంతా 'పెద్ది' దగ్గరే ఉంది.
గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ నేను దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది. 'పెద్ది' పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు పడిన శ్రమ, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానాకి నా ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట్ సతీశ్ కిలారుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, 'కరునాడ చక్రవర్తి' శ్రీ శివ రాజ్‌కుమార్ గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతి బాబు గారికి నా అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన ఏ.ఆర్. రెహమాన్ గారికి, తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన రత్నవేలు గారికి, అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన అవినాష్ కొల్లా గారికి, తన నైపుణ్యంతో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ నవీన్ నూలికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన జాన్వీ కపూర్, దివ్యేందు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు. 'పెద్ది' సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకు గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.