జూన్ 4వ తేదీ ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది: చంద్రబాబు

  • ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం
  • రాష్ట్ర వికాసం కోసం ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు అన్న చంద్రబాబు
  • రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను తమ భుజాలపై పెట్టారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పునాది పడిన రోజును గుర్తుచేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. 2024 జూన్ 4వ తేదీ (ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు) ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.


రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఐదేళ్లుగా సాగిన విధ్వంసకాండకు పూర్తిగా స్వస్తి పలికి.. రాష్ట్రాన్ని మళ్లీ వికాసం వైపు, ప్రగతి వైపు నడిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు ఇదని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక కీలక సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు తమకు అప్పగించింది కేవలం ‘అధికారాన్ని’ కాదని.. కోలుకోలేని స్థితికి చేరిన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించే ఒక ‘గొప్ప బాధ్యతను’ తమ భుజాలపై పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.


కూటమి ప్రభుత్వం ప్రతిక్షణం ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకే పనిచేస్తుందని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి,   సుపరిపాలన అనే మూడు ప్రధాన లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. సమాజంలో ఎలాంటి అసమానతలు లేని వాతావరణాన్ని నిర్మించడం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ అల్టిమేట్ గోల్ అని తేల్చి చెప్పారు.


రాష్ట్రాన్ని అటు ఆరోగ్యంగా, ఇటు ఆర్థికంగా బలోపేతం చేసి.. ప్రజలందరి ముఖాల్లో సంతోషం చూడాలన్నదే తమ ప్రభుత్వ దృఢ సంకల్పమని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా తాము పాలన సాగిస్తున్నామనే విషయాన్ని ఎంతో వినమ్రంగా ప్రకటిస్తున్నానని ఆయన అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు, రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగునా మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ, "జై ఆంధ్రప్రదేశ్" అంటూ చంద్రబాబు తన ట్వీట్‌ను ముగించారు.


Chandrababu
TDP
AP politics

More Telugu News