'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి!
- తీరప్రాంత ఏటీఎంలో డెబిట్ కార్డు మర్చిపోయిన అమెరికన్ సోలో ట్రావెలర్
- 5 గంటల దూరంలో ఉన్న తిరువనంతపురానికి వెళ్లాక కార్డు పోయినట్లు గుర్తింపు
- ఆదివారం కావడం, విమానానికి కొద్ది సమయమే ఉండటంతో టెన్షన్
- ఆటోలో 6 గంటలు ప్రయాణించి స్వయంగా కార్డు తెచ్చిచ్చిన డీహెచ్ఎల్ (DHL) ఉద్యోగి కృష్ణ
- శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చిన డబ్బును కూడా తిరస్కరించిన స్థానిక యువకుడు
ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలో సోలో ట్రిప్ చేస్తున్న సమయంలో ఆమె ఒక డీహెచ్ఎల్ (DHL) ఆఫీసుకు వెళ్లింది. అక్కడ లావాదేవీల సమన్వయం కోసం ఒక స్థానిక ఉద్యోగితో వాట్సాప్ నంబర్ మార్చుకుంది. ఆ తర్వాత ఏటీఎంలో కార్డు మర్చిపోయినట్లు గ్రహించిన ఆమె.. వెంటనే ఆ డీహెచ్ఎల్ ఉద్యోగికి మెసేజ్ చేసి, వీలైతే ఒకసారి ఆ ఏటీఎం వద్దకు వెళ్లి చూడగలరా అని అభ్యర్థించింది. ఆ సమయంలో తాను తెలిసిన హిందూ దేవుళ్లందరినీ ప్రార్థించానని ఆమె పేర్కొంది. ఆశ్చర్యకరంగా, మరుసటి రోజు కూడా ఆ కార్డు ఏటీఎం మిషన్ పైనే సురక్షితంగా దొరికింది. అయితే, ఆ మరుసటి రోజు ఆదివారం కావడం, కొరియర్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో కార్డును ఎలా పంపాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.
కానీ, ఆ రోజు రాత్రి సదరు యువతికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బిల్డింగ్ కిందకు వచ్చి చూడగా.. అక్కడ సదరు డీహెచ్ఎల్ ఉద్యోగి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోరిక్షాలో వేచి ఉన్నాడు. కార్డును స్వయంగా అందించేందుకు వారు ఆటోలో దాదాపు 6 గంటల పాటు ప్రయాణించి వచ్చారు. తిరిగి వెళ్లడంతో కలిపి వారి మొత్తం జర్నీ దాదాపు 14 గంటల పాటు సాగింది. ఈ అసాధారణ సహాయానికి కృతజ్ఞతగా ఆమె అతనికి డబ్బులు ఇవ్వబోగా.. ఆ యువకుడు నిరాకరించాడు. ఆమె బడ్జెట్ ట్రావెలర్ అని గ్రహించి, "ఈ డబ్బును నీ ప్రయాణాలకే వాడుకో" అని చెప్పి పంపేశాడు.
ఆ యువకుడి పేరు 'కృష్ణ' అని, హిందూ పురాణాలలో ప్రేమ, కరుణ, రక్షణకు మారుపేరైన దేవుడి పేరు కూడా అదేనంటూ ఆ పర్యాటకురాలు ఎమోషనల్ అయింది. కేరళకు ఉన్న "గాడ్స్ ఓన్ కంట్రీ" (దేవుడి సొంత దేశం) అనే ట్యాగ్‌లైన్ నిజమేనని ఈ ఘటన నిరూపించిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక అపరిచిత వ్యక్తి కోసం అంత దూరం ఆటోలో ప్రయాణించి వచ్చి, భారతీయుల గొప్పదనాన్ని చాటిచెప్పిన కృష్ణను రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు.