ఉచిత న్యాయ సహాయం, కోర్టు ఖర్చుల బాధ్యత వైసీపీదే.. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా

Jagan extends support to DSC candidates
  • డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశామన్న జగన్
  • వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమాలపై రీ-ఎంక్వైరీ చేయిస్తామని వెల్లడి
  • క్రీడా కోటా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శ

డీఎస్సీ పరీక్షల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. బాధితుల పక్షాన నిలిచి వారికి అవసరమైన ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామని, కోర్టు ఖర్చులన్నింటినీ తమ పార్టీయే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలపై ఇప్పటికే సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని గుర్తుచేసిన ఆయన.. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అక్రమాలపై రీ-ఎంక్వైరీ చేయించడంతో పాటు, కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక కమిషన్ కూడా వేయిస్తామని స్పష్టం చేశారు.


క్రీడా కోటా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా లోపించిందని జగన్ తీవ్రంగా విమర్శించారు. ఎలాంటి పరీక్షలు లేకుండా కేవలం సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని, చంద్రబాబు తనకు కావలసిన వారికి లబ్ధి చేకూర్చడానికే ఈ గేట్లు తెరిచారని ఆరోపించారు. అనుకున్న వారికి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కాగానే, మళ్లీ పాత జీవోను మార్చేసి కొత్త జీవోను తీసుకురావడంలో ఉన్న అంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పాలకుల స్వార్థం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు.


ప్రస్తుత డీఎస్సీ నిర్వహణలో లీకేజీల దగ్గర నుంచి అనేక అవకతవకలు బయటపడుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదనే నెపంతో ఫస్ట్ ర్యాంకర్లను పక్కన పెట్టారని ప్రభుత్వం చెబుతుంటే.. మరి అదే అభ్యర్థులు న్యాయం కోసం కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. అభ్యర్థుల ఫిర్యాదులకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానాలు కరవయ్యాయని, అధికారుల తీరులో తీవ్ర లెక్కలేనితనం కనిపిస్తోందని జగన్ దుయ్యబట్టారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News