ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో!
- హైరైజ్ అపార్ట్మెంట్ బయటి అంచున వృద్ధుడి ప్రమాదకర విన్యాసం
- పొరుగువారి ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేసిన వైనం
- సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆందోళన, ఆగ్రహం
- నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్
సమీపంలోని మరొక భవనం నుంచి ఒక వ్యక్తి సాధారణంగా అపార్ట్మెంట్ సముదాయాన్ని వీడియో తీస్తుండగా ఈ దృశ్యం వెలుగుచూసింది. ఆ వీడియోలో, కెమెరాను ఒక నిర్దిష్ట ఫ్లాట్పైకి జూమ్ చేయగా.. భూమికి చాలా ఎత్తులో ఉన్న ఒక అంతస్తు కిటికీ బయట సన్నని అంచుపై ఒక వృద్ధుడు ప్రమాదకర స్థితిలో కూర్చుని ఉండటం కనిపించింది. అతడు మొబైల్ ఫోన్ పట్టుకుని, పక్కనే ఉన్న ఫ్లాట్ బాల్కనీ వైపు ముందుకు వంగుతూ, ఆ గదిలో జరిగే విషయాలను రికార్డ్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఎత్తయిన ప్రదేశంలో ఎలాంటి రక్షణ లేకపోయినా పక్క ఫ్లాట్ వైపు మొబైల్ చూపిస్తూ చాలా సమయం గడిపిన ఆ వృద్ధుడు, చివరకు నెమ్మదిగా వెనక్కి జరిగి కిటికీ వద్ద తిన్నగా కూర్చున్నాడు.
ఈ ఘటన ఏ ప్రాంతంలో, ఏ రోజున జరిగిందనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అసలు పోస్ట్‌లో లేనప్పటికీ, ఆ వృద్ధుడి చర్యలపై ఆన్లైన్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకరి వ్యక్తిగత గోప్యత (Privacy)కు భంగం కలిగించడం కోసం ఇంతటి రిస్క్ ఎందుకు తీసుకోవాలంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం వీడియోల మోజులోనో లేదా పొరుగువారిపై నిఘా పెట్టడానికో ఇంతలా తెగించడం ముమ్మాటికీ నేరమేనని అభిప్రాయపడుతున్నారు.
ఒకరి బాల్కనీ వైపు ఫోన్ పెట్టడానికి ఇంత సాహసం చేసిన ఆ వృద్ధుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలను అస్సలు ఉపేక్షించకూడదని, అపార్ట్మెంట్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీలు వెంటనే జోక్యం చేసుకుని, సదరు వ్యక్తిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన అటు హైరైజ్ బిల్డింగులలో ప్రాణాలకు తెగించి చేసే ప్రమాదకర పనులను, ఇటు నివాస సముదాయాలలో ప్రైవసీకి ఎదురవుతున్న ముప్పులను ఒకేసారి తీవ్రమైన చర్చనీయాంశంగా మార్చింది.