కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం
- లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకార వేడుక
- తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం
- పరమేశ్వరకు ఏకైక డిప్యూటీ సీఎం పదవి
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సిద్ధరామయ్య
కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్షూటర్గా, సంక్షోభ నిర్వాహకుడిగా పేరుగాంచిన, 8 సార్లు ఎమ్మెల్యే అయిన డీకే శివకుమార్.. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన మాట్లాడుతూ.. ఈ పదవి తన కల మాత్రమే కాదని, కఠిన శ్రమ, అంకితభావానికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ బెంగళూరు, కర్ణాటక ద్వారానే ప్రపంచం భారతదేశాన్ని చూస్తోందని, రైతులు, మహిళలు, యువతతో సరికొత్త 'యువ యుగం' ప్రారంభిస్తానని డీకేఎస్ తన విజన్‌ను ప్రకటించారు.
మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ ఇంకా అధికారిక జాబితాను ప్రకటించనప్పటికీ.. తొలి విడతలో యాతీంద్ర (మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు), జి.పరమేశ్వర, కె.హెచ్.మునియప్ప, యు.టి.ఖాదర్, కె.జె.జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఎం.బి.పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. కుల, ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేసే క్రమంలో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి.పరమేశ్వర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా, సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ అసెంబ్లీ స్పీకర్ అయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, అధికార మార్పిడి సజావుగా సాగేలా చూసిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలను అప్పగించింది. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుడిగా ఆయనను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, జ్యోతిష్యుల సలహా మేరకు లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చడం విశేషం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు 'ఇండియా' కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, వివిధ మఠాల మతాధిపతులు హాజరుకానున్నారు.