టీమిండియాకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్

  • స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే నియామకం
  • భారత మాజీ స్పిన్నర్ అయిన బహుతులేకు కోచింగ్‌లో అపార అనుభవం
  • హెడ్ కోచ్ గంభీర్‌తో కలిసి పనిచేయనున్న బహుతులే
  • అఫ్గానిస్థాన్‌తో జరిగే టెస్టు నుంచి బాధ్యతలు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా సీనియర్ పురుషుల జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను నియమించింది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ నుంచి బహుతులే బాధ్యతలు స్వీకరించనున్నాడు. భారత జట్టు స్పిన్ వనరులను బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా ఈ నియామకం జరిగింది.

53 ఏళ్ల బహుతులే 2001-2003 మధ్య కాలంలో భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘమైన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 630 వికెట్లు పడగొట్టి, 6,176 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కోచ్‌గా విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ జట్లకు పనిచేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌కు కూడా సేవలందించాడు. 2022లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.

ప్రస్తుత కోచింగ్ బృందంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్‌తో కలిసి బహుతులే పనిచేయనున్నాడు. పలు సందర్భాలలో ఇండియా 'ఏ' మరియు సీనియర్ పురుషుల జట్లకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా పనిచేశాడు. 2021 నుంచి 2024 వరకు బీసీసీఐకి చెందిన నేషనల్ క్రికెట్ అకాడమీ కోచింగ్ సిబ్బందిలో కీలక సభ్యుడిగా ఉన్నాడు.

ఈ నియామకంపై బహుతులే స్పందించాడు. "భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితులు కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ఇప్పుడు కోచింగ్ రూపంలో మరోసారి భారత క్రికెట్‌కు సేవ చేసే అవకాశం రావడం చాలా ప్రత్యేకం" అని బహుతులే ఒక ప్రకటనలో తెలిపాడు.

BCCI appoints Sairaj as India spin bowling coach
TeamIndia new spin coach

More Telugu News