ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు రక్షిస్తున్న ఈ పరికరాన్ని అనుకోకుండా కనిపెట్టారు!

  • పొగ కణాలు విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేలా స్మోక్‌ డిటెక్టర్‌ డిజైన్‌
  • విషవాయువుల గుర్తించడం కోసం ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా ఆవిష్కరణ
  • లోపల అమెరిషీయం రేడియోధార్మిక పదార్థం
  • దీని రేడియేషన్ ప్లాస్టిక్ దాటి బయటకు రాదు
  • వేగంగా వచ్చే మంటలను త్వరగా గుర్తిస్తుంది
ఇళ్లలో, భవనాల్లో సీలింగ్‌కు అమర్చి ఉండే చిన్న ప్లాస్టిక్ పరికరం ‘స్మోక్ డిటెక్టర్’. బ్యాటరీ అయిపోయినప్పుడు చేసే చిన్న శబ్దం తప్ప ఇది సాధారణంగా ఎవరికంటా పడదు. కానీ ప్రమాదకరమైన మంటలు వ్యాపించక ముందే పొగను గుర్తించి ప్రాణాలు కాపాడే దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర, సైన్స్ దాగి ఉన్నాయి. దీని లోపల ఉండే ఒక చిన్న రేడియోధార్మిక పదార్థం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.

విషవాయువుల కోసం పరిశోధన
స్మోక్ డిటెక్టర్ ఆవిష్కరణ అగ్ని ప్రమాదాల కోసం జరిగింది కాదు. 1930వ దశకం చివర్లో ఒక స్విస్ శాస్త్రవేత్త విషపూరిత వాయువులను గుర్తించే పరికరంపై ప్రయోగం చేస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఎవరో సిగరెట్ వెలిగించగా ఆ పొగకు సదరు పరికరం ఒక్కసారిగా స్పందించింది. గాల్లోని కణాలు విద్యుత్ ప్రవాహంలో మార్పులు తెస్తాయని దాని ద్వారా తెలిసింది. ఆ తర్వాత 1960వ దశకంలో అమెరికా నియంత్రణ సంస్థలు రేడియోధార్మిక పదార్థాలున్న స్మోక్ డిటెక్టర్ల వాడకానికి అనుమతులు ఇచ్చాయి. మొదట్లో ఫ్యాక్టరీల్లో వాడిన వీటిని 1970ల నుంచి ఇళ్లలో కూడా అమర్చడం మొదలుపెట్టారు.

లోపల ఏం జరుగుతుందో తెలుసా
ఈ డిటెక్టర్ లోపల ఒక చిన్న అయొనైజేషన్‌ చాంబర్ ఉంటుంది. ఇందులో చాలా తక్కువ పరిమాణంలో రేడియోధార్మిక పదార్థం ఉంటుంది. దీని నుంచి వచ్చే రేణువులు గాల్లోని అణువులతో కలిసి అయాన్లను సృష్టిస్తాయి. ఈ అయాన్ల వల్ల చాంబర్‌లోని రెండు మెటల్ ప్లేట్ల మధ్య ఒక బలహీనమైన విద్యుత్ ప్రవాహం నిరంతరం సాగుతుంది. ఎప్పుడైనా గదిలో పొగ వచ్చి ఈ చాంబర్‌లోకి ప్రవేశిస్తే ఆ పొగ కణాలు అయాన్ల కదలికను అడ్డుకుంటాయి. దీనివల్ల విద్యుత్ ప్రవాహం తగ్గిపోతుంది. ఆ వెంటనే సర్క్యూట్ అలారమ్‌ను మోగించి ఇంట్లోని వారిని అప్రమత్తం చేస్తుంది.

రేడియోధార్మికత ఎంతవరకు సురక్షితం
ప్రస్తుత ఆధునిక డిటెక్టర్లలో ‘అమెరిషియం-241’ అనే మానవ నిర్మిత ఐసోటోప్‌ను వాడుతున్నారు. గతంలో రేడియం, నికెల్ వంటి పదార్థాలను వాడేవారు. ఈ రేడియోధార్మికత ప్లాస్టిక్ బాడీని దాటి బయటకు రాలేదు కాబట్టి మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. భూమి, సూర్యుడి నుంచి మనకు సహజంగా వచ్చే రేడియేషన్‌ కంటే ఈ పరికరం వల్ల వచ్చేది చాలా తక్కువ. ఒకవేళ ఇల్లు పూర్తిగా తగలబడిపోయినా లేదా ఈ పరికరాలను చెత్తలో పడేసినా పర్యావరణానికి ఎలాంటి హాని జరగని విధంగా శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు.

Smoke
Smoke Detector
Cigarette
Radiation

More Telugu News