'పెద్ది' వేదికపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన
- ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి
- స్టూడియోలు నిర్మించే నిర్మాతలకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఇస్తామని హామీ
- 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న చిత్ర బృందానికి శుభాకాంక్షలు
- రామ్ చరణ్ నటన అద్భుతమని, నటన ఆయన రక్తంలోనే ఉందని ప్రశంస
- దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభను, వినయాన్ని ప్రత్యేకంగా అభినందించిన మంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకు ఈ హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. "ఏపీలో షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల స్థానిక ప్రతిభకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 'పెద్ది' సినిమాపై మంత్రి ప్రశంసలు కురిపించారు. గ్లింప్స్, ట్రైలర్ చూస్తుంటే ఇదొక అద్భుతమైన దృశ్యకావ్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. "చెన్నైలో పుట్టి, హైదరాబాద్లో పెరిగినా... రామ్ చరణ్ ఈ రస్టిక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. నటన ఆయన నరనరాన ఉంది. రామ్ చరణ్, జాన్వి కపూర్ల జంట... అలనాటి చిరంజీవి, శ్రీదేవిల జంటను గుర్తు చేస్తోంది" అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తూర్పు గోదావరి జిల్లా వాసి కావడం గర్వంగా ఉందని, ఆయన ప్రతిభతో పాటు వినయం గొప్పదని అభినందించారు. ఈ సినిమా భారీ విజయం సాధించి, దీనిపై ఆధారపడిన వందలాది కుటుంబాలకు మేలు కలగాలని మంత్రి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.