కష్టాల్లో స్పైస్‌జెట్.. రూ. 124 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు

  • స్పైస్‌జెట్‌కు రూ. 124.65 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
  • నెలల తరబడి రిటర్నులు దాఖలు చేయకపోవడమే కారణం
  • సంస్థ జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు షోకాజ్ నోటీసు
  • నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలని అధికారుల హెచ్చరిక
  • ఇప్పటికే భారీ నష్టాల్లో కొనసాగుతున్న విమానయాన సంస్థ
ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. నెలల తరబడి జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడంలో విఫలమైనందుకు గాను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) శాఖ ఆ సంస్థకు రూ. 124.65 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు జారీ చేసింది. అంతేగాక‌ పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున కంపెనీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది.

నిర్దేశిత గడువులోగా స్పైస్‌జెట్ రిటర్నులు దాఖలు చేయకపోవడంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్-62 కింద అధికారులు ప్రొవిజనల్ అసెస్‌మెంట్ నిర్వహించి ఈ పన్ను డిమాండ్‌ను ఖరారు చేశారు. నవంబర్ నెలకు రూ. 44.44 కోట్లు, డిసెంబర్‌కు రూ. 43.79 కోట్లు, జనవరికి రూ. 12.19 కోట్లు, ఫిబ్రవరికి రూ. 12.10 కోట్లు, మార్చి నెలకు రూ. 12.12 కోట్ల చొప్పున బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దుకు సంబంధించి ఈ నెల‌ 25న షోకాజ్ నోటీసు జారీ చేసినప్పటికీ, సంస్థ నుంచి ఇంకా పూర్తిస్థాయి స్పందన రాలేదని తెలుస్తోంది. "పెండింగ్‌లో ఉన్న రిటర్నులను స్పైస్‌జెట్ వెంటనే దాఖలు చేసి, చట్టపరమైన నిబంధనలు పాటించకపోతే, కఠిన చర్యలు తీసుకుంటాం" అని ఓ అధికారి స్పష్టం చేశారు.

కాగా, స్పైస్‌జెట్ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. 2025 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.621 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. నిన్న‌టి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈలో స్పైస్‌జెట్ షేరు ధర 0.47 శాతం తగ్గి రూ.12.75 వద్ద ముగిసింది.

SpiceJet
SpiceJet GST
GST Notice
Aviation Industry
Tax Demand
Financial Trouble
Airline
GST Registration
SpiceJet Share Price

More Telugu News