‘మాన్వి లోపలికి రావొద్దు’: చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి చిట్టచివరి లేఖ!

  • ఉద్యోగం పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
  • అప్పుల ఒత్తిడి భరించలేక పంకజ్ ఆత్మహత్య
  • కూతురి ప్రాణం కోసం తలుపుపై లేఖ
  • ఫ్లాట్‌లో విషవాయువు ఉందంటూ ముందే హెచ్చరిక
  • ఐదు రోజుల తర్వాత కుళ్లిన శవం లభ్యం
ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కానీ తాను చనిపోతూ కూడా తన కుటుంబానికి ఏ హానీ జరగకూడదని ఆరాటపడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటూ.. దాని నుంచి వెలువడే విషవాయువు వల్ల తన కూతురు ప్రమాదంలో పడకూడదని ఇంటి తలుపుపై రాసిన ఆఖరి హెచ్చరిక లేఖ ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.

గుజరాత్‌లో గుండెలవిసే విషాదం
గుజరాత్‌లోని గాంధీనగర్ కుడాసన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పూనమ్ రెసిడెన్సీ ఫ్లాట్‌లో నివసించే పంకజ్ భన్సాలీ (42) అనే వ్యక్తి ఐదు నెలల క్రితం ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాలవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ‘సెల్ఫాస్’ అనే ప్రమాదకరమైన పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

తలుపుపై నోట్
ఆత్మహత్య చేసుకునే ముందు పంకజ్ తన ఫ్లాట్ తలుపు మీద ఇంగ్లీష్‌లో ఒక నోట్ రాసి అంటించాడు. "మాన్వి బయటే ఉండు.. లోపల విషవాయువు ఉంది, మాస్క్ వేసుకోండి, నీళ్లు తాగొద్దు" అని అందులో రాశాడు. ఆ మందు వల్ల ఇల్లంతా విషపూరిత వాయువులు వ్యాపిస్తాయని, లోపలికి వస్తే తన కూతురు మాన్వి ప్రాణాలకే ముప్పని గ్రహించి ఆ తండ్రి అంతలా జాగ్రత్త పడటం స్థానికులను కలచివేసింది.

ఐదు రోజుల తర్వాత బయటపడ్డ శవం
మే 13న పంకజ్ భార్య, కూతురు పుట్టింటికి వెళ్లారు. మే 22న భార్యాభర్తలు చివరిసారిగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత పంకజ్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన బంధువులు మే 27న ఫ్లాట్ వద్దకు వచ్చారు. తలుపుపై ఉన్న లేఖను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఐదు రోజుల క్రితమే పంకజ్ చనిపోవడంతో మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు
ఇన్ఫోసిటీ పోలీసులు ఘటనా స్థలం నుంచి విషపూరితమైన పురుగుల మందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉద్యోగం పోవడం, అప్పుల ఒత్తిడి వల్లే పంకజ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Pankaj Bhansali
Suicide
Gujarat
Manvi
Job loss
Financial problems
Pesticide
Poisonous gas
Infocity police
Kudasan

More Telugu News