మేనేజర్ గృహప్రవేశం.. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన సీఎం విజయ్

  • సీఎంగా అయ్యాక నల్ల బ్లేజర్, తెల్లటి చొక్కా, నల్లప్యాంటులో కనిపిస్తున్న విజయ్
  • ఈరోజు మాత్రం సంప్రదాయ దుస్తులలో గృహప్రవేశానికి హాజరు
  • అంతకుముందు సచివాలయంలో కూడా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, చెన్నైలో తన మేనేజర్ జగదీష్ పళనిసామి గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. సాధారణంగా నల్ల బ్లేజర్ ధరించే విజయ్‌ అందుకు భిన్నంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి విజయ్ నల్ల బ్లేజర్, తెల్లటి చొక్కా, నల్ల ప్యాంటులోనే కనిపిస్తున్నారు. అయితే, ఈ రోజు ఆయన సాంప్రదాయ దుస్తులలో ఈ కార్యక్రమానికి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.

విజయ్ ఈ గృహప్రవేశానికి విచ్చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆయన ఇంట్లోకి అడుగుపెట్టగానే అక్కడున్న వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. జగదీష్ కుటుంబ సభ్యులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. విజయ్‌కి గత దశాబ్దకాలంగా జగదీశ్ నమ్మకమైన మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆయన సినిమా డేట్లు, ఇతర బాధ్యతలను చూసుకునేవారు. విజయ్ నటించిన 'మాస్టర్', 'లియో' చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల సీఎం విజయ్ ఢిల్లీ పర్యటనలో జగదీష్ ఆయనతోనే ఉన్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో జరిగిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

కాగా, గృహప్రవేశ వేడుకకు హాజరయ్యే ముందు విజయ్ సచివాలయంలో కూడా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు. సెయింట్ గోబైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ.ఆర్. ఉన్నికృష్ణన్ తదితరులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. మహీంద్రా అండ్ మహీంద్రా (ఆటోమోటివ్ బిజినెస్) వేలుసామి కూడా ముఖ్యమంత్రిని కలిశారు.

Vijay
Tamil Nadu CM Vijay
Jagadish Palanisamy
Chennai
Housewarming ceremony
Traditional attire

More Telugu News