50 శాతం పడిపోయిన ఎల్‌ఐసీ షేరు విలువ.. అసలు విషయం ఇదీ!

LIC Share Price Fall Explained Bonus Share Adjustment
  • ఎల్‌ఐసీ తొలిసారి బోనస్ షేర్ల జారీ
  • 1:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటన
  • ధర సగానికి తగ్గినట్లు కనిపించిన షేరు
  • మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మార్పు లేదు
  • రికార్డు తేదీ నాటికే అర్హత నిర్ధారణ
‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్‌ఐసీ) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో దాదాపు 50 శాతం పడిపోయినట్లు కనిపించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం నాటి ముగింపు ధర రూ.830తో పోలిస్తే శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు రూ.417.60 వద్ద ప్రారంభమైంది. అయితే ఇది షేరు కుప్పకూలడం కాదు. ఎల్‌ఐసీ తొలిసారిగా ప్రకటించిన 1:1 బోనస్ షేర్ల సర్దుబాటు ప్రక్రియ మాత్రమే. వాస్తవానికి ఈ షేరు కేవలం 1.5 శాతం నష్టంతో రూ.411.45 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది.

ఏంటీ బోనస్ లెక్క?
ఎల్‌ఐసీ తన ఇన్వెస్టర్లకు ఒక షేరుకు బదులుగా మరొక షేరును ఉచితంగా బోనస్‌గా ఇవ్వాలని గత ఏప్రిల్‌లోనే నిర్ణయించింది. ఇందుకోసం మే 29ని రికార్డు తేదీగా నిర్ణయించింది. బోనస్ షేర్ల జారీ వల్ల మార్కెట్లో కంపెనీ మొత్తం షేర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది. కానీ కంపెనీ మార్కెట్ విలువలో ఎలాంటి మార్పు ఉండదు. దీనివల్ల షేరు ధర సగానికి తగ్గుతుంది. ఫలితంగా సామాన్య ఇన్వెస్టర్లకు కూడా ఈ షేరు అందుబాటులోకి వచ్చి మార్కెట్లో దీని కొనుగోళ్లు, అమ్మకాలు పెరుగుతాయి.

ఎవరు అర్హులు?
మే 29 నాటికి ఎవరి డీమ్యాట్ ఖాతాలో అయితే ఎల్‌ఐసీ షేర్లు ఉంటాయో వారే ఈ బోనస్ షేర్లు పొందడానికి అర్హులు. సెబీ నిబంధనల ప్రకారం.. రికార్డు తేదీ కంటే ఒక రోజు ముందే షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే గురువారం బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో, బుధవారమే ఎల్‌ఐసీ షేర్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ బోనస్ స్టాక్స్‌ దక్కుతాయి. 2022 మే నెలలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎల్‌ఐసీ తన 21 లక్షల మందికిపైగా ఉన్న ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు ఇవ్వడం ఇదే తొలిసారి.
Go Back to Shorts
LIC
LIC share price
LIC bonus shares
NSE
stock market
investment
bonus stocks
share value
demat account

More Telugu News