కోల్‌గేట్ టూత్‌పేస్ట్ ధరల పెంపు.. ఎంత పెరిగాయంటే..!

  • టూత్‌పేస్ట్ ధరలను పెంచిన ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ కోల్‌గేట్
  • ముడిసరుకులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే ప్రధాన కారణం
  • పాప్యులర్ వేరియంట్లపై 4 నుంచి 5 శాతం వరకు ధరల పెంపు
  • కొన్ని ప్యాక్‌లపై ధరలతో పాటు పరిమాణాన్ని కూడా పెంచిన సంస్థ
  • ప్రీమియం ఉత్పత్తులపై మరింత ఎక్కువగా ధరలను పెంచిన వైనం
ప్రముఖ ఫాస్ట్-మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) సంస్థ కోల్‌గేట్-పామోలివ్ ఇండియా తమ టూత్‌పేస్ట్ ధరలను పెంచింది. మే నెలలో పలు రకాల టూత్‌పేస్ట్ ప్యాక్‌లపై 4 నుంచి 5 శాతం వరకు ధరలను పెంచినట్లు శుక్రవారం వెల్లడించింది. ముడిసరుకులు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనం ప్రకారం కోల్‌గేట్ డెంటల్ క్రీమ్, మ్యాక్స్ ఫ్రెష్ వంటి పాప్యులర్ వేరియంట్లపై ఈ ధరల పెంపు ప్రభావం పడింది. కొత్త ధరల వివరాలను పరిశీలిస్తే, కోల్‌గేట్ డెంటల్ క్రీమ్ 200గ్రా + 100గ్రా + టూత్‌బ్రష్ ప్యాక్ ధర రూ.8 పెరిగి రూ.208కి చేరింది. అలాగే, 200 గ్రాముల డెంటల్ క్రీమ్ ప్యాక్ ధర రూ.5 పెరిగి రూ.135 అయింది.

ఇక, 100 గ్రాముల డెంటల్ క్రీమ్ ప్యాక్ ధరను రూ.3 పెంచి రూ.73కి చేర్చగా, దాని పరిమాణాన్ని కూడా 10 శాతం పెంచడం గమనార్హం. కోల్‌గేట్ మ్యాక్స్ ఫ్రెష్ బ్లూ 70గ్రా ప్యాక్ ధర రూ.4 పెరిగి రూ.83కి చేరింది. అయితే, ప్రీమియం ఉత్పత్తులపై ధరల పెంపు మరింత ఎక్కువగా ఉంది. విజిబుల్ వైట్ పర్పుల్ 200గ్రా ప్యాక్ ధర ఏకంగా రూ.17 పెరిగి రూ.395కి చేరుకుంది.

తక్కువ ధర కలిగిన ప్యాక్‌ల ధరలను మాత్రం ప్రస్తుతానికి పెంచే అవకాశం లేదని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. సామాన్య ప్రజలు ఎక్కువగా కొనే ఈ ఉత్పత్తుల ధరల విషయంలో కంపెనీలు సున్నితంగా వ్యవహరిస్తాయని తెలిపారు. కాగా, కోల్‌గేట్-పామోలివ్ ఇండియా మొత్తం ఆదాయంలో దాదాపు 80 శాతం వాటా టూత్‌పేస్ట్ అమ్మకాల నుంచే వస్తుంది.

Colgate
Colgate Palmolive India
toothpaste price hike
FMCG
dental cream
max fresh
price increase
consumer goods
toothpaste prices

More Telugu News