లోకేశ్ నాయకత్వంలో టీడీపీ సరికొత్త పొలిటికల్ విజన్ తో ముందుకెళుతుంది: శ్రీభరత్

  • విశాఖలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీభరత్
  • దేశం మొత్తం పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం దక్కించుకుందని వెల్లడి
  • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్ర స్థాయిలో అద్భుతంగా పనిచేసిందని వ్యాఖ్య

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక 'మహానాడు' వేడుకల సందర్భంగా విశాఖపట్నం టీడీపీ లోక్‌సభ సభ్యుడు శ్రీభరత్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అత్యంత కీలకమైన గణాంకాలను వెల్లడించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.


ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ... దేశంలో గత ఏడాది వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏకంగా 25 శాతం వాటాని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దక్కించుకుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదం క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసిందని, పారదర్శకమైన విధానాల వల్లే పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు మొగ్గు చూపారని ఆయన స్పష్టం చేశారు.


పార్టీ పరంగా నారా లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడం అత్యంత శుభసూచకమని, ఆయన నాయకత్వంలో టీడీపీ సరికొత్త విజన్ పాలిటిక్స్‌తో ముందుకు వెళుతుందని శ్రీభరత్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో 20 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న యువతకు క్రియాశీల రాజకీయాల్లో టీడీపీ పెద్దపీట వేస్తుందని వెల్లడించారు. అలాగే భవిష్యత్తులో మహిళా బిల్లు చట్టం అమలులోకి రావడం ఖాయమని, పార్టీలోకి పెద్ద ఎత్తున మహిళా శ్రేణులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.


ఈ ఏడాది మహానాడు చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,850 క్లస్టర్లలో ఒకే సమయంలో వర్చువల్ (హైబ్రిడ్) విధానంలో ఈ సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగానే విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 82 క్లస్టర్లలో భారీ స్క్రీన్లను అమర్చారు. మంగళగిరి ప్రధాన వేదిక నుంచి సాగిన ప్రత్యక్ష ప్రసారాన్ని, సీఎం చంద్రబాబు సహా ఇతర నేతల ఉపన్యాసాలను వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏకకాలంలో వీక్షించి ఈ డిజిటల్ మహానాడును విజయవంతం చేశారు.



Sri Bharat
TDP Mahanadu
Andhra Pradesh Investments
Nara Lokesh
Visakhapatnam
Telugu Desam Party
AP Economy
Speed of Doing Business
Chandrababu Naidu
Women in Politics

More Telugu News