ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్లు కాదు: సుప్రీంకోర్టు

Supreme Court Clarifies Voter List Removal Does Not Mean Loss of Citizenship
  • ఈసీ పరిధి కేవలం ఎన్నికల వరకే
  • తొలగించిన పేర్లను కేంద్రానికి పంపాలని ఆదేశం
  • హోం శాఖ ఆధ్వర్యంలో పౌరసత్వ విచారణ
  • పౌరులని తేలితే ఓటు హక్కు పునరుద్ధరణ
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సమర్థించిన సుప్రీంకోర్టు పౌరసత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఓటరు జాబితా నుంచి వ్యక్తి పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం రద్దయినట్లు కాదని స్పష్టం చేసింది.

ఎన్నికలకే పరిమితం
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటరు జాబితా సవరణ కేవలం ఎన్నికల్లో పాల్గొనేందుకు మాత్రమే పరిమితమని పేర్కొంది. ఓటరు జాబితాలో పేరు చేర్చాలా? వద్దా? అని నిర్ణయించే అధికారం మాత్రమే ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేసింది. అంతేకానీ ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు ఈసీకి లేదని తెలిపింది.

అనుమానిత పేర్లు కేంద్రానికి
పౌరసత్వంపై అనుమానంతో ఓటరు జాబితా నుంచి తొలగించిన వారి పేర్లను మాత్రం కేంద్ర హోం శాఖకు పంపాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ వివరాలను నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గత కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెరపడింది.

ఎన్నికలలోపే తేల్చాలి
కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను అందుకున్న తర్వాత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఆయా వ్యక్తుల పౌరసత్వ క్లెయిములపై విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. తదుపరి అసెంబ్లీ లేదా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ విచారణలో వారు భారత పౌరులని తేలితే వెంటనే వారి పేర్లను మళ్లీ ఓటరు జాబితాలో పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
Go Back to Shorts
Supreme Court
Voter list
Citizenship
Election Commission
Voter ID
India elections
Home Ministry
National Register of Citizens
NRC
Voter verification

More Telugu News