ఎస్‌ఐఆర్-2026 పారదర్శకం: సీఈవో వివేక్ యాదవ్ హామీ

Vivek Yadav assures transparency in SIR 2026
  • 24 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఈ సమగ్ర సవరణ
  • జూన్ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని వెల్లడి
  • సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేస్తామని ప్రకటన
  • రాష్ట్రవ్యాప్తంగా 4.16 కోట్ల ఓటర్ల వివరాలను 46,397 మంది బీఎల్ఓలు పరిశీలిస్తారన్న సీఈవో
  • రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి సహకరించాలని వినతి 
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్-2026) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ హామీ ఇచ్చారు. నిన్న సచివాలయంలో  టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్-2026 నిర్వహణ, షెడ్యూల్‌ను వివరించారు.

రాష్ట్రంలో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ సమగ్ర సవరణ చేపడుతున్నట్లు వివేక్ యాదవ్ తెలిపారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు, నకిలీ రిజిస్ట్రేషన్లు, వలస వెళ్లిన వారి పేర్లను తొలగించి, కచ్చితమైన, విశ్వసనీయమైన జాబితాను రూపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. "ఎస్‌ఐఆర్-2026 పారదర్శకంగా నిర్వహిస్తాం" అని ఆయన ఉద్ఘాటించారు.

షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి జులై 14 వరకు 46,397 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 4.16 కోట్ల ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి, ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, చేర్పుల కోసం అవకాశం కల్పిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములు కావాలని, ప్రతి బూత్‌కు బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏ) నియమించి సహకరించాలని వివేక్ యాదవ్ కోరారు. సరైన విచారణ లేకుండా ఏ ఒక్క ఓటరు పేరునూ జాబితా నుంచి తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Vivek Yadav
Andhra Pradesh
CEO Andhra Pradesh
electoral roll
voter list
special summary revision
political parties
booth level officers
voter registration
election commission

More Telugu News