హైదరాబాదులో కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య!

  • మాసాబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఢీకొట్టిన కారు
  • తొలుత హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు
  • వక్ఫ్ బోర్డు భూముల వివాదం నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించిన పోలీసులు
హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఒక కారు ఢీకొట్టింది. ఆయన కారు ఎక్కుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఢీకొట్టిన కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఖాజా మొయినుద్దీన్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటలకే మృతి చెందారు.

మొదట ఈ ఘటనను పోలీసులు హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ హిట్ అండ్ రన్ కేసుపై అనుమానాలు వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు భూముల వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఖాజా మొయినుద్దీన్ స్నేహితుడు అడ్వకేట్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, రెక్కీ నిర్వహించి అతనిని కారుతో ఢీకొట్టి హత్య చేశారని ఆరోపించారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీకొట్టారని వెల్లడించారు. మలక్‌పేటలోని వక్ఫ్ ఆస్తులు, భూములకు సంబంధించి ఇద్దరితో వివాదం కొనసాగుతున్నట్లు తెలిపారు.

గతంలో కూడా నిందితులు ఆయనకు హాని తలపెట్టే ప్రయత్నం చేశారని అన్నారు. వీరిద్దరిపై ఖాజా మొయినుద్దీన్ గతంలో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాడు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. ఆయన చనిపోవడానికి కొద్దిసేపటి ముందు తనతో మాట్లాడారని తెలిపారు. ఆయన ఎక్కువగా వక్ఫ్ భూముల తగాదా కేసులను వాదిస్తారని తెలిపారు.

Khaja Moinuddin
Hyderabad
lawyer murder
hit and run case
Waqf board lands dispute
Masab Tank

More Telugu News