ఉగ్రవాది అంత్యక్రియలకు టాప్ టెర్రరిస్టులు... పాక్ అబద్ధాలు బట్టబయలు

  • పాక్‌లో హతమైన అల్-బద్ర్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అంత్యక్రియలు
  • ఇస్లామాబాద్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరైన టాప్ టెర్రరిస్టులు
  • హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, అల్-బద్ర్ చీఫ్ బఖ్త్ జమీన్ ఖాన్ హాజరు
  • ఏకే-47లతో ఉగ్రనేతలకు భారీ భద్రత కల్పించిన ఉగ్రవాదులు
  • ఉగ్రవాదానికి అడ్డా తమ దేశం కాదన్న పాక్ వాదనలు మరోసారి అబద్ధమని తేలిన వైనం
ఉగ్రవాదానికి తమ దేశం కేంద్రం కాదని పాకిస్థాన్ చెప్పే మాటలు మరోసారి నీటిమూటలయ్యాయి. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు పాకిస్థాన్ సురక్షితమైన అడ్డాగా మారిందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ, ఇస్లామాబాద్‌లోనే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల హతమైన ఓ ఉగ్రవాది అంత్యక్రియలకు అనేక మంది టాప్ టెర్రరిస్టులు బహిరంగంగా హాజరై, పాకిస్థాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చూపించారు.

వివరాల్లోకి వెళితే, నిషేధిత అల్-బద్ర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్, 'డాక్టర్' అనే కోడ్‌నేమ్‌తో పనిచేసిన అర్జుమంద్ గుల్జార్ దార్ అలియాస్ హంజా బుర్హాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించాడు. శుక్రవారం అతని మృతదేహానికి ఇస్లామాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాచే ఉగ్రవాదిగా ప్రకటించబడిన హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌తో పాటు అల్-బద్ర్‌ చీఫ్ బఖ్త్ జమీన్ ఖాన్ వంటి కీలక ఉగ్రవాదులు హాజరయ్యారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా బఖ్త్ జమీన్ ఖాన్ చుట్టూ ఏకే-47 వంటి ఆధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్న నేపథ్యంలో, తమ నేతల భద్రతపై ఉగ్రవాద సంస్థలు ఆందోళన చెందుతున్నాయని ఈ ఘటన తెలియజేస్తోంది. ఈ హత్యల పరంపర ఉగ్రవాదుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నట్లు సమాచారం.

ఎవ‌రీ హంజా బుర్హాన్?
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా రత్నిపొరకు చెందిన బుర్హాన్, చట్టబద్ధమైన పత్రాలతో పాకిస్థాన్‌కు ప్రయాణించి అల్-బద్ర్ సంస్థలో చేరాడు. 2019లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న పుల్వామా దాడిలో ఇతని పేరు తొలిసారిగా తెరపైకి వచ్చింది. కశ్మీర్‌లోని యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, నియామకాలు చేపట్టడం, పాకిస్థాన్ నుంచి నిధులు సమకూర్చడంలో బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని భారత భద్రతా ఏజెన్సీలు చెబుతున్నాయి. 2022లో భారత్ ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పీఓకేలోని ముజఫరాబాద్‌లో ఓ ప్రైవేట్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ వేరే గుర్తింపుతో దాక్కున్న ఇతడిని, గురువారం ఉదయం కాలేజీ గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి కాల్చి చంపారు. తలకు మూడు బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రిలో మరణించినట్లు పాక్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Arjumand Gulzar Dar
Hamza Burhan
Syed Salahuddin
Al-Badr
Hizbul Mujahideen
Pakistan terrorism
Pulwama attack
POK
Terrorist funeral
Bakhth Zameen Khan

More Telugu News