తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. వడదెబ్బతో 34 మంది మృతి

  • తెలంగాణలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు
  • వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 34 మంది మృతి
  • కుమ్రం భీం జిల్లాలో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • 18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
  • రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రం భానుడి భగభగలతో అగ్నిగుండంలా మారుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిప్పుల వర్షం కురుస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతూ, రాష్ట్రంలో ఇప్పటివరకు వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ రాష్ట్రంలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు.

నిన్న‌ రాష్ట్రంలోనే అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (టి)లో 46.5 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల, కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్, సూర్యాపేట సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46.4 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46.2 నుంచి 46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నిన్న‌ ఒక్కరోజే 244 మండలాల్లో తీవ్రమైన ఎండల ప్రభావం కనిపించింది. సూర్యాపేట జిల్లాలోని 22 మండలాల్లో, మంచిర్యాల, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల్లో 18 చొప్పున మండలాల్లో వడగాలులు వీచాయి.

సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత వాతావరణం చల్లబడుతుంది. కానీ, గాలిలో తేమ శాతం పూర్తిగా పడిపోవడంతో రాత్రిపూట కూడా వేడి సెగలు, ఉక్కపోత తగ్గడం లేదు. గురువారం రాత్రి హైదరాబాద్, హకీంపేట, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సాధారణం కంటే 2.7 నుంచి 4.7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు రాత్రుళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రానున్న నాలుగు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించాయి. ఈనెల 26 వరకు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు ఉద‌యం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telangana Heatwave
Telangana
Heatwave
Red Alert
Weather Update
Heat Stroke Deaths
IMD
Weather Forecast
India Meteorological Department

More Telugu News