ఆర్సీబీపై సన్‌రైజర్స్ ఘనవిజయం.. అయినా తప్పని ఎలిమినేటర్!

Sunrisers Hyderabad Victory Over RCB But Still in Eliminator
  • ఆర్సీబీపై 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపు
  • తొలుత బ్యాటింగ్ చేసి 255 పరుగుల భారీ స్కోరు చేసిన హైదరాబాద్
  • ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్ అర్ధ సెంచరీలు
  • గెలిచినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకున్న రైజర్స్
  • ఈ నెల 27న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అయితే, ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలన్న సన్‌రైజర్స్ ఆశ నెరవేరలేదు. సమీకరణాల కారణంగా మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 79), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 56), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. చివరిలో నితీశ్ కుమార్ రెడ్డి (12 బంతుల్లో 29 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 44; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 4.3 ఓవర్లకే జట్టు స్కోరును 60 పరుగులకు చేర్చాడు. అయితే, ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అతను ఔటవ్వడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి కళ్లెం పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ (15), దేవదత్ పడిక్కల్ (21) కూడా పెవిలియన్ చేరడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. 

ఈ దశలో కెప్టెన్ రజత్ పటీదార్ (39 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరి పోరాటం చేశాడు. కృనాల్ పాండ్యతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, అవసరమైన రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో ఒత్తిడి పెరిగింది. పటీదార్ అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఔటయ్యాడు. చివరిలో కృనాల్ పాండ్య (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) ప్రయత్నించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో మలింగ రెండు వికెట్లతో రాణించగా, సాకిబ్ హుస్సేన్, ట్రావిస్ హెడ్ చెరో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో లీగ్ దశను ముగించింది. అయితే, మూడో స్థానంలో నిలవడంతో ఈ నెల 27న ముల్లన్ పూర్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిస్తే ఫైనల్ బెర్త్ కోసం క్వాలిఫయర్ 2లో తలపడుతుంది.

అటు, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ కూడా 14 మ్యాచ్ లలో 9 విజయాలు నమోదు చేశాయి. అయితే, మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ తొలి స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో ఉన్నాయి. మూడు బెర్తులు స్టాండింగ్స్ తో సహా ఖరారైన నేపథ్యంలో, నాలుగో బెర్తు కోసం రాజస్థాన్, పంజాబ్, కోల్ కతా, ఢిల్లీ జట్ల మధ్య పోటీ నెలకొంది. 

అటు, ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ కూడా 14 మ్యాచ్ లలో 9 విజయాలు నమోదు చేశాయి. అయితే, మెరుగైన రన్ రేట్ కారణంగా ఆర్సీబీ తొలి స్థానంలో, గుజరాత్ రెండో స్థానంలో ఉన్నాయి. సన్ రైజర్స్ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ మూడు జట్లు 18 పాయింట్లతో ఉన్నాయి. మూడు బెర్తులు స్టాండింగ్స్ తో సహా ఖరారైన నేపథ్యంలో, నాలుగో బెర్తు కోసం రాజస్థాన్, పంజాబ్, కోల్ కతా, ఢిల్లీ జట్ల మధ్య పోటీ నెలకొంది. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో సన్ రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనుంది.
Go Back to Shorts
Sunrisers Hyderabad
SRH vs RCB
IPL 2026
Royal Challengers Bangalore
Rajiv Gandhi International Stadium
Eliminator Match
Ishan Kishan
Abhishek Sharma
Heinrich Klassen
Rajat Patidar

More Telugu News