మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ కాదా?: జగన్

Jagan Alleges TDP Responsible for Raja Reddy Death
  • ఏపీలో హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబే అన్న జగన్
  • వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపారని వ్యాఖ్య
  • బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దరిని కాల్చిపడేశారన్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబేనని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి కుట్ర రాజకీయాలు అనే అంశాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు, కొన్ని అనుకూల మీడియా సంస్థలతో కలిసి మాఫియా ముఠాగా మారి అబద్ధాలు, దొంగ సాక్ష్యాలు సృష్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.


హత్యా రాజకీయాలకు తమదే అతి పెద్ద బాధిత కుటుంబం జగన్ పేర్కొన్నారు. తమ కుటుంబంలో ముగ్గురు కీలక వ్యక్తులు బలయ్యారంటూ ఆయన పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. 1999 ఎన్నికలకు ఏడాది ముందు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే తన తాత రాజారెడ్డి హత్యకు గురయ్యారని, తన తాతాను చంపింది టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ను పులివెందులకు పరిమితం చేయాలనే రాజకీయ కోణంలోనే ఈ హత్య జరిగిందన్నారు. ఈ కేసులో నిందితులను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దాచిపెట్టి అధికార దుర్వినియోగంతో రక్షించారని ఆరోపించారు.


అసెంబ్లీలో 'నువ్వు సభకు ఎలా వస్తావో చూస్తాం' అని వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు అన్న క్లిప్పింగులు ఇప్పటికీ ఉన్నాయని, ఆ మాట అన్న నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారని జగన్ గుర్తుచేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తానే చంపానని టీవీ లైవ్ షోలలో ఒప్పుకున్న దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ పోలీసుల అండతో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని.. చంద్రబాబుకు, దస్తగిరికి ఒకే లాయర్ (లూథ్రా) వాదిస్తున్నారని, దీని వెనుక ఎవరి క్రిమినల్ బ్రెయిన్ ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు.

చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దరిని కాల్చిపడేశారని జగన్ అన్నారు. నందమూరి హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి కేటీఆర్‌తో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబువి శవ రాజకీయాలు కావా అని ప్రశ్నించారు. సొంత మామ, రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీ, పార్టీ, గుర్తు లాక్కుని ఆయన చనిపోవడానికి కారణమైంది చంద్రబాబేనని విమర్శించారు.

 

విజయవాడలో నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగాను నరికి చంపిన కేసులో నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారని జగన్ చెప్పారు. అలాగే ఎన్టీఆర్ పై దాడి కేసులో అరెస్టయి, లాడ్జీలో శవమై తేలిన మల్లెల బాబ్జీ మరణం వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. 


"నేను మంచివాడ్ని కాబట్టే మా తాతను చంపిన వాళ్లు కూడా ఇవాళ ప్రశాంతంగా తిరుగుతున్నారు.. నేను చెడ్డవాడినైతే వాళ్లు అలా ఉండేవారా?" అని జగన్ ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయం చేయడం తమ నైజమని.. 77 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు ఇలాంటి చిల్లర, కుట్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. చంద్రబాబుకు బహుశా ఇదే చివరి రాజకీయ టర్మ్ కావచ్చని అన్నారు.

Go Back to Shorts
Jagan Mohan Reddy
YS Jagan
Chandrababu Naidu
TDP
YS Rajasekhara Reddy
Andhra Pradesh Politics
Murder Politics
Raja Reddy Murder
YS Vivekananda Reddy
NTR Trust Bhavan

More Telugu News