చేతులెత్తేసిన ప్రసార భారతి.. భారత్‌లో ఫిఫా ప్రసారాలు కష్టమేనా?.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌!

  • ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాలపై భారత్‌లో కొనసాగుతున్న అనిశ్చితి
  • ప్రసార హక్కుల బాధ్యత తమది కాదని ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ప్రసార భారతి
  • అమెరికా, మెక్సికో, కెనడాలో మ్యాచ్‌లు కావడంతో అర్థరాత్రి దాటాక ప్రసారాలు
  • భారీ వ్యూయర్‌షిప్ ఉన్నప్పటికీ బ్రాడ్‌కాస్టర్ల నుంచి ఆసక్తి కరవు
  • జూన్ 12న టోర్నీ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో పెరుగుతున్న టెన్షన్
ఐపీఎల్ ముగింపు ద‌శ‌కు చేర‌డంతో భార‌త‌ క్రీడాభిమానుల దృష్టి ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ సమరంపై పడింది. ఫిఫా వరల్డ్ కప్ 2026కి సమయం దగ్గర పడుతుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్‌లో దీని ప్రసారాలపై మాత్రం తీవ్ర గందరగోళం నెలకొంది. టోర్నమెంట్ మొదలవడానికి కేవలం మూడు వారాల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, ఇంతవరకు ఏ బ్రాడ్‌కాస్టర్ కూడా టెలివిజన్ ప్రసార హక్కులను ఖరారు చేసుకోలేదు. ఈ అనిశ్చితి ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రసార హక్కులను పొందడం తమ బాధ్యత కాదన్న‌ ప్రసార భారతి 
ఈ గందరగోళానికి మరింత ఆజ్యం పోస్తూ, ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి కూడా చేతులెత్తేసింది. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను పొందడం తమ బాధ్యత కాదని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దేశంలోని కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానుల్లో నిరాశ రెట్టింపయింది. సంప్రదాయ ఫుట్‌బాల్ ప్రియులతో పాటు యువతరం కూడా ఈ మెగా ఈవెంట్‌ను ఎలా చూడాలనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

చైనా తర్వాత అత్యధిక వీక్షకులు మన దేశం నుంచే 
నిజానికి భారత్‌లో క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ ఫుట్‌బాల్‌కు లేకపోయినా, ఫిఫా వరల్డ్ కప్ సమయంలో దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవర్ కనిపిస్తుంది. గోవా, కేరళ, కోల్‌కతా వంటి ప్రాంతాల్లోనే కాకుండా దేశమంతటా ఈ సందడి నెలకొంటుంది. 2022లో ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్‌ను భారత్‌లో దాదాపు 745 మిలియన్ల మంది వీక్షించారు. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక వీక్షకులు మన దేశం నుంచే ఉన్నారు. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ, బ్రాడ్‌కాస్టర్లు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మొత్తం 48 జట్లు.. 104 మ్యాచ్‌ లు  
ఈసారి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 48 జట్లు, 104 మ్యాచ్‌లతో ఈ టోర్నీ గతంలో కంటే భారీగా జరగనుంది. అయితే, బ్రాడ్‌కాస్టర్లు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం మ్యాచ్ సమయాలు. ఆయా దేశాల టైమ్ జోన్‌ల ప్రకారం చాలా మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రారంభమవుతాయి. జులై 20న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం అర్థరాత్రి 12:30 గంటలకు మొదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 104 మ్యాచ్‌లలో కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే అర్థరాత్రి లోపు ప్రారంభం కానున్నాయి. ఈ కారణంగానే ప్రసార హక్కుల విషయంలో బ్రాడ్‌కాస్టర్లు విముఖత చూపుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

FIFA World Cup 2026
FIFA
Prasar Bharati
Football
Sports Broadcasting
India Football Fans
TV Rights
Sports
World Cup
Football telecast

More Telugu News