టీమిండియా టెస్టు, వన్డే జట్లలో నితీశ్ కు చోటు... అగార్కర్ ఏమన్నాడంటే...!

Team India Selects Nitish Kumar Reddy Agarkar Comments
  • అఫ్గానిస్థాన్‌తో టెస్టు మ్యాచ్‌కు ఎంపికైన తెలుగు క్రికెటర్ నితీశ్ రెడ్డి
  • నితీశ్‌పై ప్రశంసలు కురిపించిన చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్
  • ప్రస్తుత ఆల్ రౌండర్లలో నితీశ్ అత్యుత్తమమని వ్యాఖ్య
  • వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అవకాశాలు ఇస్తామని వెల్లడి
టీమిండియా యువ ఆల్ రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు నితీశ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్న నేపథ్యంలో, సెలక్షన్ కమిటీ తరఫున అగార్కర్ మాట్లాడారు. నితీశ్ పురోగతి అద్భుతంగా ఉందని, భవిష్యత్తులో భారత జట్టులో కీలక ఆటగాడిగా మారతాడని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం ఉన్న ఆల్ రౌండర్లలో నితీశ్ కుమార్ రెడ్డి అత్యుత్తమం. అతని ఆటలో కనిపిస్తున్న మెరుగుదల పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. రాబోయే సిరీస్‌లలో అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించాం. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని నితీశ్‌ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా చూస్తాం" అని అగార్కర్ స్పష్టం చేశారు.

అగార్కర్ వ్యాఖ్యలతో, చాలాకాలంగా టీమిండియాలో కీలక పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా స్థానానికి నితీశ్ రూపంలో గట్టి పోటీ ఎదురైనట్లేనని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన నితీశ్, ఇప్పటివరకు 10 టెస్టులు ఆడి ఒక సెంచరీతో 396 పరుగులు చేసి, 8 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్, ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లలో 235 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసి జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు.
Go Back to Shorts
Nitish Kumar Reddy
Ajit Agarkar
Team India
Indian Cricket
Sunrisers Hyderabad
IPL 2026
All-rounder
Cricket Selection
Hardik Pandya
Visakhapatnam

More Telugu News