బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. మళ్లీ తెరపైకి ఐపీఎస్ దమయంతి సేన్!

  • బెంగాల్‌లో టీఎంసీ హయాం అక్రమాలపై విచారణకు బీజేపీ ప్రభుత్వం కమిషన్
  • మహిళలపై నేరాల విచారణ కమిటీలో ఐపీఎస్ దమయంతి సేన్‌కు కీలక పదవి
  • 2012 పార్క్ స్ట్రీట్ రేప్ కేసు తర్వాత దమయంతిని పక్కనపెట్టిన మమత ప్రభుత్వం 
  • ఆ కేసును మమత 'కల్పిత కథ'గా అభివర్ణించడంపై అప్పట్లో వివాదం
  • సందేశ్‌ఖాలీ వంటి ఘటనలపై విచారణ జరపనున్న కమిషన్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. గత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పాలనలో జరిగిన అవినీతి, మహిళలపై నేరాలపై విచారణ జరిపేందుకు రెండు కమిషన్లను ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలు, చిన్నారులపై జరిగిన దాడులను విచారించే కమిటీలో సీనియర్ ఐపీఎస్ అధికారిణి దమయంతి సేన్‌కు సభ్య కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కమిషన్‌కు రిటైర్డ్ జస్టిస్ సమాప్తి ఛటర్జీ నేతృత్వం వహిస్తారని ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారం ప్రకటించారు. ఒకప్పుడు టీఎంసీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించి, ఆ తర్వాత ప్రాధాన్యం కోల్పోయిన దమయంతి సేన్‌కు మళ్లీ కీలక పదవి లభించడం గమనార్హం.

ఎవరీ దమయంతి సేన్?
2012లో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన పార్క్ స్ట్రీట్ రేప్ కేసు దర్యాప్తుతో దమయంతి సేన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అప్పట్లో కోల్‌కతా క్రైమ్ బ్రాంచ్‌కు జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఆమె.. కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. అయితే, అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇదొక 'కల్పిత కథ' (సజానో ఘటనా) అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది.

రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తినా దమయంతి సేన్ నేతృత్వంలోని బృందం దర్యాప్తును వేగవంతం చేసి కొన్ని రోజుల్లోనే నిందితులను పట్టుకుంది. అత్యాచారం జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో ప్రభుత్వ వాదనకు పోలీసుల నివేదిక భిన్నంగా నిలిచింది. ఈ కేసును ఛేదించిన కొంతకాలానికే దమయంతి సేన్‌ను క్రైమ్ బ్రాంచ్ నుంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి బదిలీ చేశారు. నిజాయతీగా దర్యాప్తు చేసినందుకే ఆమెను ప్రాధాన్యం లేని పోస్టుకు పంపారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ తర్వాత చాలా ఏళ్లపాటు ఆమెకు కీలకమైన బాధ్యతలు దక్కలేదు. అయితే, 2022లో కలకత్తా హైకోర్టు కొన్ని కీలక కేసుల దర్యాప్తును ఆమెకు అప్పగించి, ఆమెపై నమ్మకాన్ని ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, టీఎంసీ హయాంలో జరిగిన సందేశ్‌ఖాలీ, కస్బా, బోగ్టుయ్ వంటి అనేక ఘటనలపై విచారణ జరిపే కమిటీలో ఆమెకు కీలక బాధ్యత ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Damayanti Sen
West Bengal Politics
Suvendu Adhikari
TMC
Mamata Banerjee
Park Street Rape Case
Kolkata Crime Branch
Police Investigation
সন্দেশখালি
Kasba Bogtui

More Telugu News