Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్‌కి మద్దతిచ్చాక కూడా నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు: తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు

Thirumavalavan Reveals CM Post Offer After Supporting Vijay
Advertisement
  • విజయ్ పార్టీకి మద్దతిచ్చాక కూడా సీఎం పదవి ఆఫర్ చేశారన్న తిరుమావళవన్
  • డీఎంకే, ఏఐఏడీఎంకేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడి
  • నన్ను సీఎం, పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారని వ్యాఖ్య
  • ఈ ఆఫర్లను నవ్వుతూ తిరస్కరించానని స్పష్టం చేసిన వీసీకే చీఫ్
Advertisement
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతు లేఖ ఇచ్చిన తర్వాత కూడా తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారంటూ వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) అధ్యక్షుడు థోల్ తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే, ఏఐఏడీఎంకేల నుంచి ఈ ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని తాను నవ్వుతూ తిరస్కరించానని ఆయన స్పష్టం చేశారు.

ఓ జాతీయ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన తిరుమావళవన్, తమిళనాడు రాజకీయాల్లో తెర వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలను వివరించారు. టీవీకేకు మద్దతు ప్రకటించిన తర్వాత కూడా తనకు సీఎం పదవిని ఆఫర్ చేశారని, మద్దతు ఉపసంహరించుకోవాలని, మీడియాతో మాట్లాడొద్దని కూడా సూచించారని ఆయన తెలిపారు.

అంతకుముందు, ఎడప్పాడి పళనిస్వామిని సీఎం చేసేందుకు డీఎంకే ప్రతిపాదించగా, తాము, వామపక్షాలు వ్యతిరేకించామన్నారు. ఆ తర్వాత తనను సీఎం, పళనిస్వామిని డిప్యూటీ సీఎంగా చేస్తామంటూ మరో ప్రతిపాదన వచ్చిందని, "తమిళనాడులో ఇలాంటివి జరగవు" అని చెప్పి ఆ ఆఫర్‌ను నవ్వేసి కొట్టిపారేశానని వివరించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే డీఎంకే, ఏఐఏడీఎంకేలు తెర వెనుక చర్చలు జరిపినట్లు తిరుమావళవన్ వ్యాఖ్యలు ధృవీకరిస్తున్నాయి.

అయితే, చివరికి వీసీకే మద్దతుతోనే టీవీకే మెజారిటీ మార్కును అందుకుని, విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తిరుమావళవన్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపే అవకాశాలున్నాయి.
Advertisement
Advertisement
Thirumavalavan
Tamil Nadu Politics
VCK
Vijay TVK
DMK
AIADMK
Chief Minister Offer
Tamilaga Vettri Kazhagam
Edappadi Palaniswami
Tamil Nadu Elections

More Telugu News