బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu Rides Royal Enfield Bullet 350 Photos
  • తిరుపతి జిల్లాలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్  ప్లాంట్
  • ఏడాదికి 9 లక్షల బైక్‌ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటు
  • సుమారు 15,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన
  • 18 నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కంపెనీకి సీఎం సూచన
  • ఏపీ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థ ఈవీ ప్రయాణానికి దోహదపడుతుందని వెల్లడి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ ఏపీలో భారీ పెట్టుబడి పెడుతుండడం తెలిసిందే. రాష్ట్రంలో సుమారు రూ. 2,500 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ మోటార్ సైకిల్ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో బి. గోవిందరాజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో సుమారు 15,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ ఎక్కి ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ భేటీపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. 

"రాయల్ ఎన్‌ఫీల్డ్, ఆంధ్రప్రదేశ్‌కు మీకు ఇదే నా హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', మీ ఎలక్ట్రిక్ వాహన ప్రయాణానికి అవసరమైన గ్రీన్ ఎనర్జీ వాతావరణం, ప్రతిభావంతులైన యువత మీ ప్రగతికి చోదకశక్తిగా నిలుస్తాయని నేను హామీ ఇస్తున్నాను. రాయల్ ఎన్‌ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శ్రీ బి. గోవిందరాజన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమవడం నాకు చాలా ఆనందంగా ఉంది.

తిరుపతి జిల్లా, సత్యవేడు మండలంలోని వన్నెలూరు, రాళ్ళకుప్పం గ్రామాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ మోటార్‌సైకిల్ తయారీ ప్రాజెక్టుపై మేం చర్చించాం. దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడితో, ఏటా 9 లక్షల మోటార్‌సైకిళ్ల తయారీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అత్యాధునిక తయారీ కేంద్రం, టెస్టింగ్ ట్రాక్, ఆర్&డి సెంటర్, ప్రత్యేక వెండార్ పార్క్ కూడా ఉంటాయి. ముఖ్యంగా, ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 15,000 ఉద్యోగాలు రానున్నాయి. ఇది ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని, ఆర్థిక కార్యకలాపాలను గణనీయంగా పెంచుతుంది.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేసి, పనులను వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని వారికి నేను భరోసా ఇచ్చాను. వారు ప్రతిపాదించిన 24 నెలలకు బదులుగా, 18 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వారికి సహాయపడటమే మా లక్ష్యం. మా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ప్రాజెక్ట్‌ను వేగంగా ముందుకు నడిపిస్తుంది, దానికి దీటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా 'స్పీడ్ ఇన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్' చూపించాలని నేను కోరుకుంటున్నాను.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' గురించి తెలుసుకోవడం కూడా నాకు సంతోషాన్నిచ్చింది. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ సుస్థిర మొబిలిటీలో నాయకత్వ స్థానానికి ఎలా ఎదుగుతోందో కూడా ఈ సమావేశంలో మేం చర్చించాం. ఫ్యూచర్ మొబిలిటీ, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఇండస్ట్రియల్ గ్రోత్‌కు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రధాన కేంద్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగా మేం కట్టుబడి ఉన్నాం" అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Royal Enfield
Andhra Pradesh
Motorcycle Manufacturing
Investment
AP Government
Electric Vehicles
B Govindarajan
Job Creation
Vanneluru

More Telugu News