పునాదుల దశలోనే అద్దాలకు రూ. 2,500 కోట్లు కేటాయించారు: పేర్ని నాని

  • అమరావతి రైతు సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని పేర్ని నాని మండిపాటు
  • అమరావతిలో కేవలం మట్టి వ్యాపారం మాత్రమే జరుగుతోందని ఆరోపణ
  • ప్రభుత్వం కూలిపోతుందని పవన్ కు అర్థమయిందని వ్యాఖ్య

అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. ఈరోజు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలో సచివాలయం ఇంకా పునాదుల దశలోనే ఉన్నా, అప్పుడే అద్దాల కోసం రూ. 2,500 కోట్లు కేటాయించి ప్రజా సొమ్మును వృధా చేస్తున్నారని మండిపడ్డారు. గత రెండేళ్లలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదని, రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లలో పనులు జరగడం లేదని విమర్శించారు.


ప్రస్తుతం అమరావతిలో కేవలం మట్టి వ్యాపారం మాత్రమే జరుగుతోందని, రోజుకు వెయ్యి టిప్పర్లలో మట్టిని తరలిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, తన వీడియోలను యూట్యూబ్, ట్విట్టర్ల నుండి తొలగిస్తూ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్ సంస్థలకు, ప్రముఖులకు ప్రైమ్ లొకేషన్లలో భూములిస్తూ, నమ్ముకున్న 29 గ్రామాల రైతులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసానికి రైతుల కష్టాలు తెలియవన్నారు. ఇక ప్రభుత్వం కూలిపోతుందని అర్థమయ్యాకే పవన్ కల్యాణ్ కొత్త గెటప్‌లోకి మారారని, జనసేన కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు.


Perni Nani
Amaravati
Andhra Pradesh
TDP
YSRCP
Farmers
Land Scam
Pawan Kalyan
Janasena
AP Politics

More Telugu News