రిటైర్ అయ్యాక కూడా ఎన్‌పీఎస్ డబ్బులపై లాభాలు.. కొత్త పెన్షన్ రూల్స్ తెచ్చిన కేంద్రం!

NPS New Rules Earn Profits After Retirement
  • ఎన్‌పీఎస్ రిటైర్మెంట్ ఫండ్స్ కోసం కొత్త విధానం
  • ఒకేసారి కాకుండా విడతల వారీగా నగదు విత్‌డ్రా
  • వయసుతో పాటు రిస్క్ తగ్గించే ఈక్విటీ గ్లైడ్ పాత్
  • మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌తో పెరగనున్న కార్పస్
  • 85 ఏళ్ల వయసు వరకు సేవలు లభ్యం
రిటైర్ అయ్యాక చేతికి వచ్చే పెన్షన్ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా పొందుతూ.. మిగిలిన సొమ్ముపై లాభాలు ఆర్జించే సరికొత్త అవకాశాన్ని ‘నేషనల్ పెన్షన్ సిస్టమ్’ (ఎన్‌పీఎస్‌) తీసుకొచ్చింది. ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ’ (పీఎఫ్‌ఆర్‌డీఏ) 2026 జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. రిటైర్మెంట్ ఇన్‌కమ్ స్కీమ్స్ (ఆర్‌ఐఎస్‌), డ్రాడౌన్ ఆప్షన్లను కొత్తగా ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బులు త్వరగా అయిపోకుండా మార్కెట్ లింక్డ్ లాభాలతో పాటు నెలనెలా స్థిరమైన ఆదాయం అందించడమే ఈ కొత్త విధానం ఉద్దేశం.

ఇప్పటివరకు ఉన్న నియమం
ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం.. ఎన్‌పీఎస్ చందాదారులు రిటైర్ అయినప్పుడు తమ మొత్తం కార్పస్‌లో గరిష్ఠంగా 60 శాతాన్ని ఒకేసారి ట్యాక్స్ లేకుండా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. మిగిలిన 40 శాతం సొమ్ముతో కచ్చితంగా ‘యాన్యుటీ’ కొనుగోలు చేయాలి. దీని ద్వారానే వారికి నెలవారీ పెన్షన్ వచ్చేది. అయితే ఒకేసారి చేతికి వచ్చే 60 శాతం మొత్తాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడేవారు.

కొత్త మార్పు
కొత్త నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ తర్వాత ఒకేసారి 60 శాతం సొమ్మును తీసేసుకోకుండా, దానిని ఎన్‌పీఎస్‌లోనే ఉంచి విడతల వారీగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమేటిక్ విత్‌డ్రా ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)లాగా పనిచేస్తుంది. దీనివల్ల సాధారణ పెన్షన్‌తో పాటు అదనంగా క్రమం తప్పకుండా డబ్బు చేతికి అందుతుంది. అయితే 40 శాతం యాన్యుటీ కొనుగోలు నిబంధనలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు. అలాగే ఈ డబ్బు మార్కెట్లో పెట్టుబడిగా ఉంటుంది గనక ప్రతిసారీ ఒకే రకమైన ఫిక్స్‌డ్ అమౌంట్ వస్తుందనే గ్యారెంటీ ఉండదు.

ఆర్‌ఐఎస్‌ అంటే
యాన్యుటీ కొనుగోలు చేయగా మిగిలిన సొమ్మును వెంటనే విత్‌డ్రా చేయకుండా ఎన్‌పీఎస్‌లోనే ఉంచే ప్రత్యేక పెట్టుబడి ఆప్షనే ఈ ‘ఆర్‌ఐఎస్‌’. దీని ద్వారా దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ అందుకోవచ్చు. ఇందులో ‘RIS Steady’ అనే యాన్యువల్ గ్లైడ్ పాత్ మోడల్ ఉంటుంది. దీని ప్రకారం.. వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ తగ్గించడానికి ఈక్విటీ (షేర్ మార్కెట్) పెట్టుబడులను తగ్గిస్తారు. 60 ఏళ్ల వయసులో ఈక్విటీ కేటాయింపు 35 శాతంగా ఉంటే అది 75 ఏళ్లకు చేరేసరికి 10 శాతానికి తగ్గుతుంది. 85 ఏళ్ల వరకు అదే 10 శాతం వద్ద కొనసాగుతుంది.

డ్రాడౌన్ ఆప్షన్
ఈ విడతల వారీ చెల్లింపుల కోసం చందాదారులు రెండు పద్ధతులలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు:

సిస్టమేటిక్ పేఅవుట్ రేట్: ఇందులో చందాదారుడి ప్రస్తుత వయసు, వారు ఎంచుకున్న ముగింపు వయసు ఆధారంగా పేఅవుట్ శాతం మారుతూ వస్తుంది.

సిస్టమేటిక్ యూనిట్ రిడంప్షన్: ఇందులో ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో యూనిట్లను విక్రయించి నగదుగా మారుస్తారు.

ఉదాహరణకు: ఒక వ్యక్తి 60 ఏళ్లకు రూ. 80 లక్షల కార్పస్‌తో రిటైర్ అయ్యాడనుకుందాం. ఎన్‌పీఎస్ ఎన్‌ఏవీ రూ.10 ఉంటే అతని వద్ద 8 లక్షల యూనిట్లు ఉంటాయి. అతను 25 ఏళ్ల పాటు నెలవారీ పేఅవుట్ ఎంచుకుంటే.. నియమం ప్రకారం (మొత్తం యూనిట్లు / కాలవ్యవధి × ఫ్రీక్వెన్సీ) ప్రతి నెలా 2,666.67 యూనిట్లు అమ్ముతారు. ఆ సమయంలో మార్కెట్ ఎన్‌ఏవీ ధరను బట్టి వచ్చే నగదు అతని అకౌంట్లో జమవుతుంది.

ప్రయోజనాలు:
  • రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా లేదా నిర్ణీత కాలానికి నమ్మకమైన నగదు అందుతుంది.
  • డబ్బులు మార్కెట్లోనే కొనసాగడం వల్ల ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా మెరుగైన రిటర్న్స్ వస్తాయి.
  • రిటైర్మెంట్ పొదుపు డబ్బులు ఒక్కసారిగా ఖర్చు అయిపోకుండా ఎక్కువ కాలం ఉంటాయి.

ఈ కొత్త పథకం చందాదారులకు 85 ఏళ్ల వయసు వచ్చే వరకు అందుబాటులో ఉంటుంది. పెన్షనర్లు తమకు నచ్చిన ఫండ్ మేనేజర్‌ను ప్రతి రెండు ఆర్థిక సంవత్సరాలకు ఒకసారి మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించారు.
Go Back to Shorts
National Pension System
NPS
Pension Fund Regulatory and Development Authority
PFRDA
retirement income schemes
RIS
drawdown option
systematic withdrawal plan
SWP
annuity

More Telugu News