పాపం.. పాంటింగ్‌.. ఆ ఫొటో చూస్తుంటే భావోద్వేగంగా ఉంది: అశ్విన్

Ricky Ponting Emotional Photo Ashwin Blames Punjab Kings Management
  • వరుసగా ఆరో ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం
  • డగౌట్‌లో ఒంటరిగా కనిపించిన హెడ్ కోచ్ రికీ పాంటింగ్
  • పంజాబ్ పరిస్థితికి ఫ్రాంచైజీదే బాధ్యతన్న రవిచంద్రన్ అశ్విన్
  • రెండు హోం గ్రౌండ్‌లలో ఆడటమే ఓటములకు కారణమని విమర్శ
  • క్రికెట్ కన్నా వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారని వ్యాఖ్య
ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్రస్థానం దాదాపు ముగిసినట్టే. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఆ జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమణ అంచున నిలిచింది. మ్యాచ్ అనంతరం డగౌట్‌లో హెడ్ కోచ్, దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ ఒంటరిగా, తీవ్ర నిరాశతో కూర్చున్న దృశ్యం అందరినీ కదిలించింది.

ఈ ఫొటోపై టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో స్పందించాడు. పాంటింగ్ ఒంటరిగా కూర్చున్న చిత్రం ఎంతో భావోద్వేగంతో కూడుకున్న‌దని, పంజాబ్ పరిస్థితికి ఫ్రాంచైజీ యాజమాన్యమే కారణమని తీవ్ర విమర్శించాడు. జట్టు ప్రయోజనాలను పక్కనపెట్టి, రెండు వేర్వేరు హోం గ్రౌండ్‌లలో ఆడాలన్న ఫ్రాంచైజీ నిర్ణయమే కొంపముంచిందని స్పష్టం చేశాడు.

అశ్విన్ మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో టాప్-2లో నిలవాల్సిన జట్టు ఇలాంటి స్థితికి రావడం బాధాకరం. నేను 2018లో ఇదే కుర్చీలో కూర్చున్నాను. ఛాంపియన్ జట్లేవీ రెండు, మూడు హోం గ్రౌండ్‌లలో ఆడవు. మొహాలీలో వరుసగా గెలిచి, మంచి ఊపు మీదున్న సమయంలో ధర్మశాలకు వచ్చి వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయారు. వారి ఓటమికి వారే కారణం" అని అన్నాడు.

"మొహాలీ, ధర్మశాల పిచ్‌లకు పేస్, బౌన్స్ విషయంలో చాలా తేడా ఉంది. ఎత్తులో తేడా ఉండటంతో పిచ్ భిన్నంగా ప్రవర్తిస్తుంది. దీనివల్ల యువ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. క్రికెట్ అవసరాల కన్నా వ్యాపార ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ధర్మశాలలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఇప్పుడు వారి పరిస్థితి వేరేలా ఉండేది. ఈ పరిస్థితికి రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంతో బాధపడతారు. కానీ, గెలవాలనుకుంటే సొంత మైదానాన్ని వదిలి ఇలాంటి తప్పులు చేయకూడదు" అని అశ్విన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. కాగా, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది.
Go Back to Shorts
Ricky Ponting
Punjab Kings
IPL 2026
R Ashwin
Dharamsala
Mohali
Franchise Management
Home Ground Advantage
Shreyas Iyer
Lucknow Super Giants

More Telugu News