బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక మలుపు.. జీవితఖైదు పడే సెక్షన్ నమోదు

Bandi Bhagirath POCSO Case New Twist Life Imprisonment Section Added
  • పోక్సో కేసులో బండి భగీరథ్‌పై మరో కఠిన సెక్షన్ నమోదు
  • బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు
  • ప్రత్యేక అధికారిగా డీసీపీ రితిరాజ్‌ దర్యాప్తుతో కీలక మలుపు
  • నేరం రుజువైతే పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం
సంచలనం సృష్టించిన పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై దర్యాప్తు అధికారులు కేసును మరింత తీవ్రతరం చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌)లోని 64(2)(M) సెక్షన్‌ను అదనంగా చేర్చారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే నిందితుడికి పదేళ్లకు పైగా జైలు శిక్ష, కొన్ని సందర్భాల్లో జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది.

ఈ నెల 8న బాధితురాలైన మైనర్‌పై లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆమె తల్లి పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు, కేసు నమోదు విషయంలో పోలీసులు హైడ్రామా సృష్టించారని, బలహీనమైన సెక్షన్లు నమోదు చేశారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకునే క్రమంలో పోలీసులు నిజం చెప్పకుండా ఒత్తిడి చేశారన్న విమర్శలు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్‌ను ఈ కేసుకు ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించింది.

వెంటనే రంగంలోకి దిగిన డీసీపీ రితిరాజ్‌, సోమవారం సాయంత్రం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు ఫైళ్లను పరిశీలించారు. పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలంలో స్పష్టత లేదని గుర్తించి, దర్యాప్తును లోతుగా చేపట్టారు. మంగళవారం డీసీపీ స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి, ఆమెతో స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడారు. పోక్సో కేసుల దర్యాప్తు నిబంధనల ప్రకారం, ఆమె నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. బాధితురాలు చెప్పిన విషయాలకు, పోలీసులు మొదట నమోదు చేసిన సెక్షన్లకు పొంతన లేదని గ్రహించారు.

బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి జరిగిందని ఆమె వాంగ్మూలం ద్వారా తెలియడంతో ఇది అత్యంత తీవ్రమైన నేరమని డీసీపీ నిర్ధారించుకున్నారు. బాధితురాలి ఆరోపణలు పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1), 6 పరిధిలోకి వస్తాయని గుర్తించారు. దీనికి సమానమైన బీఎన్ఎస్ సెక్షన్ 64(2)(M)ను కేసులో చేర్చాలని ఆదేశించారు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే నిందితుడికి కనిష్ఠంగా 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, గరిష్ఠంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Go Back to Shorts
Bandi Bhagirath
POCSO Act
Rithiraj DCP
Petbasheerabad Police Station
Indian Penal Code
Sexual Assault
Minor Victim
Telangana Crime
Kukatpally Zone
Bandi Bhagirath Case

More Telugu News