యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది.. స్థానికుల దాడిలో హతం!

  • ప్రేమను నిరాకరించిందని  జడ్చర్లలో యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు
  • నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టిన స్థానికులు, బంధువులు
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిందితుడూ మృతి
  • యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడమే కారణమని ఆరోపణలు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది ప్రజల దాడిలో హతమయ్యాడు. ప్రేమను నిరాకరించిందన్న కక్షతో ఓ యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు, ఆ తర్వాత స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే... జడ్చర్లలోని నిమ్మబావిగడ్డకు చెందిన వైష్ణవి (24) పోలేపల్లి సెజ్‌లోని ఓ పాఠశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. శనివారం సాయంత్రం విధులను ముగించుకుని ఇంటికి వెళుతుండగా, అదే ప్రాంతానికి చెందిన తేజ ఆమెను అడ్డగించాడు. తనను ప్రేమించాలని కొంతకాలంగా వేధిస్తున్న తేజ, వెంట తెచ్చుకున్న కత్తితో వైష్ణవిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గొంతు, కడుపు భాగాల్లో పొడవడంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.

ఈ దారుణాన్ని కళ్లారా చూసిన వైష్ణవి కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. తేజను పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్ర గాయాలతో ఉన్న తేజను మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున అతడు మృతి చెందాడు.

గత రెండేళ్లుగా తేజ తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, ఆమె నిరాకరించడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వైష్ణవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వైష్ణవికి వేరొకరితో నిశ్చితార్థం జరగడం కూడా తేజ కక్ష పెంచుకోవడానికి కారణమైందని చెబుతున్నారు. మరోవైపు, చనిపోయే ముందు తేజ... "వైష్ణవి నన్ను వాడుకుని డబ్బులు తీసుకుని మోసం చేసింది, అందుకే హత్య చేశాను" అని చెప్పినట్లుగా సమాచారం. ఈ ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకోవడంతో జడ్చర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Vaishnavi
Jadcherla
Mahbubnagar
Love harassment
Stabbing
Murder
Teja
Crime news
Andhra Pradesh
Telangana

More Telugu News