సతీశన్ ప్రమాణ స్వీకారానికి శశి థరూర్ డుమ్మా!

Shashi Tharoor Skips VD Satheesan Swearing in Ceremony
  • కేరళ నూతన ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారానికి శశి థరూర్ గైర్హాజరు
  • అమెరికాలో పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి వెళ్లడమే కారణమని వెల్లడి
  • కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాల నేపథ్యంలో ఈ పరిణామంపై చర్చ
  • సతీశన్‌కు ఇది తగిన గుర్తింపు అంటూనే అభినందనలు తెలిపిన థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. కేరళ నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన వీడీ సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని కొన్ని వర్గాలతో థరూర్‌కు విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ వారాంతంలో తాను అమెరికాలోని బోస్టన్‌లో పర్యటిస్తున్నానని, అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని థరూర్ 'ఎక్స్' వేదికగా తెలిపారు. తాను చదువుకున్న టఫ్ట్స్ యూనివర్సిటీలోని ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లమసీ స్నాతకోత్సవంలో ప్రసంగించాల్సి ఉందని, అలాగే తన గ్రాడ్యుయేటింగ్ క్లాస్ 50వ వార్షికోత్సవ రీయూనియన్‌లో పాల్గొంటున్నానని వివరించారు. "అమెరికాలో గతాన్ని గుర్తుచేసుకుంటూనే, కేరళ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు.

అయితే, గతంలోనూ థరూర్ పలు కీలక పార్టీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో కేరళ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలపై చర్చించేందుకు ఢిల్లీలో హైకమాండ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన వెళ్లలేదు. దీంతో పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగానే ఆయన దూరంగా ఉంటున్నారనే ఊహాగానాలు బలపడుతున్నాయి.

మరోవైపు, ముఖ్యమంత్రిగా ఎంపికైనందుకు వీడీ సతీశన్‌కు థరూర్ అభినందనలు తెలిపారు. సతీశన్ పట్టుదల, అంకితభావానికి ఇది తగిన గుర్తింపు అని ప్రశంసించారు. యూడీఎఫ్ విజయం ఒక వ్యక్తిది కాదని, ఇది ‘టీమ్ యూడీఎఫ్’ విజయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గానూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Shashi Tharoor
VD Satheesan
Kerala
Congress
UDF
Kerala Assembly Elections
Indian Politics
Thiruvananthapuram
Tufts University
Fletcher School of Law and Diplomacy

More Telugu News