వామ్మో... ఈ ఊరి నిండా పాములే!

Shetphal Village Maharashtra Home to Cobras
  • స్నేక్ విలేజ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మహారాష్ట్రలోని షేట్‌ఫల్ గ్రామం 
  • నాగుపాములతో విడదీయలేని బంధం కలిగి ఉన్న గ్రామస్తులు
  • పాములు విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి ఇంట్లో ప్రత్యేక స్థాలాలు

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న షేట్‌ఫల్ గ్రామం గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. పాము అంటేనే ఆమడ దూరం పరుగెత్తే ఈ రోజుల్లో, అత్యంత ప్రమాదకరమైన నాగుపాములతో ఆ గ్రామ ప్రజలు విడదీయలేని బంధాన్ని కలిగి ఉండటం ఆశ్చర్యకరం.


ఈ ఊరిలో మరో వింత ఏమిటంటే, ప్రతి ఇంట్లో 'దేవస్థానం' పేరుతో పాములు విశ్రాంతి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్మిస్తారు. పాములు కేవలం బయట తిరగడమే కాకుండా, స్వేచ్ఛగా ఇళ్లలోకి, బడుల్లోకి, గుడిలోకి వస్తూ పోతూ ఉంటాయి. వీటిని ఎవరూ బంధించరు. అలాగే పెంపుడు జంతువుల్లా చూడరు. కేవలం దైవస్వరూపాలుగా భావించి గౌరవిస్తారు.


విషసర్పాలతో ఇన్నేళ్లుగా కలిసి ఉంటున్నా, అక్కడ పాముకాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు దాదాపు లేవని గ్రామస్థులు చెబుతుంటారు. మనుషులు, పాముల మధ్య ఉన్న పరస్పర గౌరవమే దీనికి కారణమని వారు నమ్ముతారు. ఇక్కడ పిల్లలు నాగుపాములతో ఆడుకోవడం అక్కడికి వచ్చే పర్యాటకులకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది.


షేట్‌ఫల్ గ్రామంలో ఎక్కువగా కనిపించేవి నాగుపాములు. వీటితో పాటు జెర్రిపోతులు, కట్లపాములు, పచ్చపాములు, నీటి పాములు కూడా కనిపిస్తాయి. అప్పుడప్పుడు కొండచిలువలు కూడా దర్శనమిస్తుంటాయి. ఈ గ్రామం పూణె అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి టాక్సీలో వెళ్లవచ్చు. సోలాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉంటుంది. పూణే నుంచి సుమారు 200 కి.మీ. దూరంలో ఈ గ్రామం ఉంటుంది.

Go Back to Shorts
Shetphal
Shetphal village
snake village
Solapur
Maharashtra
cobra
indian cobra
snake worship
rural tourism
Pune airport

More Telugu News