నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు... టాలీవుడ్ లో ఏం జరుగుతోంది?.

Ram Charans Peddhi Release Sparks Tollywood Conflict
  • పెద్ది సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో పర్సంటేజీపై చర్చ
  • పర్సంటేజీ విధానం అనుమతించిన సినిమాలనే ప్రదర్శిస్తామన్న ఎగ్జిబిటర్లు
  • ఏకపక్ష నిర్ణయం సరికాదన్న నిర్మాతలు
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదలకు ముందు టాలీవుడ్‌లో నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు అన్నట్లుగా మారింది. ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్‌లలో పర్సంటెజీ విధానానికి అంగీకరించిన నిర్మాతల సినిమాలనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

ఈ నిర్ణయంపై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించింది. రవిశంకర్ యలమంచిలి, నాగవంశీ, సాహు గారపాటి, సతీష్ కిలారు తదితరులు ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. మూడు సెక్టార్లు కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు.

రవిశంకర్ మాట్లాడుతూ, తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్నారు. సినిమా అనేది ఏ ఒక్కరి కష్టం కాదని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో ఒక ఎకో సిస్టమ్ ఉందని తెలిపారు. ఎగ్జిబిటర్ల ఇబ్బందులను తాము అర్థం చేసుకుంటామని అన్నారు. అయితే పరిశ్రమలో అందరూ కలిసి మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఎగ్జిబిటర్ వ్యవస్థలో మార్పు రావాలని, కానీ ఇప్పటికిప్పుడు మార్పు రావాలంటే కష్టమని అన్నారు.

హరిహర వీరమల్లు విడుదల సమయంలో పర్సంటేజీ విధానం బయటకు వచ్చిందని, ఆ తర్వాత మరెన్నో సినిమాలు విడుదలయ్యాయని అన్నారు. ఇప్పుడు పెద్ది సినిమా విడుదల అవుతున్న సందర్భంగా బ్లాక్‌మెయిల్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

పర్సంటేజీ విధానాన్ని అమలు చేసే సినిమాలనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని నాగవంశీ అన్నారు. ఎగ్జిబిటర్లు అడుగుతున్న పర్సంటేజీని తాము ఇవ్వలేమని అన్నారు. మల్టీప్లెక్స్‌లు ఉన్న ఒక ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడటం, అలాగే పర్సంటేజీ ప్రకటించిన 23 థియేటర్లు లీజులోనే ఉండటం హాస్యాస్పదమని అన్నారు.
Go Back to Shorts
Ram Charan
Peddhi Movie
Telugu Cinema
Tollywood
Producers vs Exhibitors
Telangana Exhibitors Association

More Telugu News