పాత ప్రేమ... ప్రాణాల మీదికి తెచ్చింది

Vamshi Murder Case Love Affair Turns Deadly in Peddapalli
  • పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణం
  • పదో తరగతిలో ప్రేమించుకున్న వంశీ, అలేఖ్య
  • తర్వాత నవీన్‌తో అలేఖ్య వివాహం
  • గత సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలిసిన అలేఖ్య, వంశీ
  • అలేఖ్య నెంబర్ తీసుకుని సందేశాలు పంపించిన వంశీ
  • స్నేహితుడితో కలిసి వంశీని హత్య చేసిన అలేఖ్య భర్త
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన వంశీ, అలేఖ్య పదో తరగతిలో ప్రేమించుకున్నారు. కొన్నాళ్లకు అలేఖ్యకు నవీన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. గత సంవత్సరం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా అలేఖ్య ఫోన్ నెంబర్ తీసుకున్న వంశీ, ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో నవీన్ తన స్నేహితుడితో కలిసి వంశీని హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సింగిరెడ్డిపల్లికి చెందిన వంశీ, అలేఖ్య పదో తరగతి చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత నవీన్‌ను అలేఖ్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2025 ఫిబ్రవరిలో పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఆ సమయంలో అలేఖ్య ఫోన్ నెంబర్‌ను వంశీ తీసుకున్నాడు. తరుచూ ఆమెకు సందేశాలు పంపించేవాడు. ఫోన్ చేసి వేధించేవాడు.

కొన్ని సందర్భాలలో హైదరాబాద్‌లో ఉంటున్న అలేఖ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. విషయం తెలుసుకున్న అలేఖ్య భర్త నవీన్, తన మిత్రుడు భాస్కర్‌తో కలిసి వంశీని మందలించాడు. అలేఖ్యను అదేపనిగా వేధిస్తుండటంతో వంశీని హతమార్చాలని నవీన్ నిర్ణయించుకున్నాడు. భాస్కర్‌తో కలిసి పథకం వేశాడు. గత నెల 30వ తేదీన వంశీని హైదరాబాద్‌కు రప్పించి, భాస్కర్ ఫ్లాట్ కు తీసుకెళ్లి పథకం ప్రకారం మద్యం తాగించి కత్తితో పొడిచి హత్య చేశారు.

నవీన్, భాస్కర్ కలిసి వంశీ మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి మ్యాట్‌లో చుట్టి కారు డిక్కీలో పెట్టుకుని, మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకువచ్చి, రోడ్డు పక్కన లోయలో పడేశాడు. ఇంట్లో రక్తపు మరకలను తుడిచివేశారు. వంశీ కనిపించకపోవడంతో అతని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి కారు, ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
Vamshi
Alekhya
Naveen
Singireddipalle
Telangana crime
love affair murder
school love story

More Telugu News