ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత

Prateek Yadav Son of Mulayam Singh Yadav Dies at 38
  • ఆసుపత్రికి తీసుకురావడానికి ముందే మరణించినట్లు వైద్యుల నిర్ధారణ
  • ఊపిరితిత్తుల సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ప్రతీక్
  • మృతికి కచ్చితమైన కారణం తేల్చేందుకు పోస్ట్‌మార్టంకు ఆదేశం
  • కొన్ని రోజుల క్రితమే భార్య అపర్ణతో విడాకులపై ప్రకటన.. ఆపై వెనక్కి
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ (38) ఆకస్మిక మరణం చెందారు. లక్నోలో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు.

బుధవారం ఉదయం 6:15 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ప్రతీక్‌ను లక్నో సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ సమయంలో ఆయన భార్య, బీజేపీ నేత అపర్ణా యాదవ్ అక్కడ లేరని సమాచారం. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ప్రతీక్, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు.

ప్రతీక్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా గుర్తించారు. మృతికి కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించనుంది.

కాగా, ప్రతీక్ యాదవ్ ఇటీవలి కాలంలో తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. తన భార్య అపర్ణా యాదవ్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి సంచలనం సృష్టించారు. అపర్ణ స్వార్థపరురాలని, ఆమె తన కుటుంబ బంధాలను నాశనం చేసిందని ఆరోపించారు. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే తమ మధ్య సత్సంబంధాలు తిరిగి నెలకొన్నాయని మరో ప్రకటన చేశారు. ప్రతీక్, అపర్ణలకు 2011లో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Go Back to Shorts
Prateek Yadav
Mulayam Singh Yadav
Akhilesh Yadav
Aparna Yadav
Samajwadi Party
Lucknow
Uttar Pradesh
Political News
Family Dispute
Death

More Telugu News