Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వలసదారులకు, టారిఫ్ లకు లింకు పెట్టిన ట్రంప్

Donald Trump Says Tariff Threats Made Countries Accept Deported Migrants
Advertisement
  • తమ దేశ పౌరులను వెనక్కి తీసుకోని దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించినట్టు ట్రంప్ వెల్లడి
  • రికార్డు స్థాయిలో 2 లక్షల మంది నేరస్థులను అరెస్ట్ చేశామని ప్రకటన
  • గత 12 నెలల్లో 6 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను బహిష్కరించినట్టు వెల్లడి
  • ఫెంటనిల్ డ్రగ్ స్మగ్లింగ్ 60 శాతం మేర తగ్గిపోయిందని తెలిపిన ట్రంప్
  • అమెరికా చట్ట అమలు సంస్థలను గొప్ప దేశభక్తులుగా కొనియాడిన అధ్యక్షుడు
Advertisement
అక్రమ వలసదారుల విషయంలో తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా నుంచి బహిష్కరించిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకునేందుకు నిరాకరించిన దేశాలను టారిఫ్‌లతో (సుంకాలతో) హెచ్చరించామని, దాంతో అవి వెంటనే దారికి వచ్చాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న‌ వైట్‌హౌస్‌లో 'పోలీస్ వీక్' సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. "నేను అధికారం చేపట్టినప్పటి నుంచి మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో దాదాపు 2 లక్షల మంది నేరస్థులను అరెస్ట్ చేసింది. వారిని వీధుల నుంచి ఏరివేసి జైళ్లలో పెడుతున్నాం లేదా చాలా సందర్భాల్లో వారు వచ్చిన దేశాలకే తిరిగి పంపిస్తున్నాం. కొన్నిసార్లు వారి దేశాలు, 'మాకు వాళ్లు వద్దు, వారిని తీసుకోము' అని చెబుతాయి. అప్పుడు నేను, 'సరే, మీ దేశంపై 25% టారిఫ్‌లు విధిస్తాం' అని చెబుతాను. వెంటనే వారు ఫోన్ చేసి, 'వారిని తిరిగి పంపండి, సంతోషంగా స్వీకరిస్తాం' అని చెబుతారు" అని వివరించారు. ఈ పద్ధతి అద్భుతంగా పనిచేసిందని ఆయన అన్నారు.

గత 12 నెలల కాలంలో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సుమారు 6,15,000 మంది అక్రమ వలస నేరస్థులను దేశం నుంచి బహిష్కరించిందని ట్రంప్ తెలిపారు. అలాగే, దేశ దక్షిణ సరిహద్దు ద్వారా ఒక్క అక్రమ వలసదారుడిని కూడా దేశంలోకి అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు.

అమెరికాను పట్టిపీడిస్తున్న ఫెంటనిల్ డ్రగ్ స్మగ్లింగ్ గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. సరిహద్దుల గుండా జరిగే ఫెంటనిల్ సరఫరా 60 శాతానికి పైగా తగ్గిపోయిందని, సముద్ర మార్గం ద్వారా వచ్చే స్మగ్లింగ్ 97 శాతం పడిపోయిందని వెల్లడించారు. ఈ విజయాలన్నీ అమెరికా చట్ట అమలు సంస్థల వల్లే సాధ్యమయ్యాయని ప్రశంసించారు. ఐసీఈ, హోంల్యాండ్ సెక్యూరిటీ, యూఎస్ మార్షల్స్, ఏటీఎఫ్, ఎఫ్‌బీఐతో పాటు రాష్ట్ర, స్థానిక పోలీసుల సేవలను కొనియాడారు. వారందరూ అద్భుతమైన దేశభక్తులని, గొప్ప వ్యక్తులని ట్రంప్ కితాబిచ్చారు.
Advertisement
Advertisement
Donald Trump
Illegal immigrants
Tariffs
US Immigration
Homeland Security
Fentanyl
Drug Smuggling
White House
Police Week

More Telugu News