తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలు.. సీఎం రేసులో అనూహ్యంగా తిరుమావళవన్?

Thirumavalavan Unexpectedly in Tamil Nadu CM Race New Political Equations
  • తమిళనాడులో హంగ్.. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ
  • మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిన విజయ్ పార్టీ టీవీకే
  • కేవలం రెండు సీట్లతో కింగ్ మేకర్‌గా మారిన వీసీకే పార్టీ
  • వీసీకే చీఫ్ తిరుమావళవన్‌కు సీఎం పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం
  • విజయ్‌ను నిలువరించేందుకు ఏకమవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలకు, సరికొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) మ్యాజిక్ ఫిగర్‌కు రెండు సీట్ల దూరంలో నిలిచిపోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేవలం రెండు స్థానాలు గెలుచుకున్న విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) కింగ్‌మేకర్‌గా అవతరించింది. ఇప్పుడు ఆ పార్టీ అధినేత థోల్ తిరుమావళవన్ పేరు ముఖ్యమంత్రి రేసులో అనూహ్యంగా తెరపైకి రావడం పెను సంచలనం సృష్టిస్తోంది.

అసలేంటి ఈ సంఖ్యాబలం?
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ నాయకత్వంలోని కూటమి బలం 116గా ఉంది. ఇందులో టీవీకేకు 107 మంది, కాంగ్రెస్‌కు ఐదుగురు, వామపక్షాలకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇద్దరి మద్దతు లభిస్తే విజయ్ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరు. ఇక్కడే రెండు స్థానాలున్న వీసీకే పాత్ర కీలకంగా మారింది. అయితే, వీసీకే తన మద్దతుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు చెన్నైకి చేరుకుంటున్నారని, ఇద్దరూ సంతకాలు చేశాకే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వీసీకే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీసీకే తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది. అంతకుముందు విజయ్.. ఏఎంఎంకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతు కోరగా, వారు నిరాకరించారు.

విజయ్‌ను అడ్డుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేల బంధం?
విజయ్ కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉండగా, తెరవెనుక మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేలు.. విజయ్ ప్రభంజనాన్ని, ఆయన్ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా రహస్య మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళ రాజకీయాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ రెండు పార్టీలు ఏకతాటిపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

తిరుమావళవన్‌కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్! 
ఈ రెండు పార్టీలు కలిసి వీసీకే మద్దతును కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీసీకే అధినేత తిరుమావళవన్‌కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కూటమికి కూడా సంఖ్యాబలం ఓ పెద్ద సమస్యగా ఉంది. డీఎంకే (59), అన్నాడీఎంకే (47)లకు వీసీకే (2) కలిసినా వారి బలం 108కి మాత్రమే చేరుతుంది. మెజారిటీకి ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విజయ్ కూటమి, డీఎంకే-అన్నాడీఎంకే కూటమి మధ్య అధికార పోరు తీవ్రస్థాయికి చేరింది. అందరి దృష్టి వీసీకే నిర్ణయంపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుందనే దానిపైనే తదుపరి ప్రభుత్వం ఎవరిదన్నది ఆధారపడి ఉంది.
Go Back to Shorts
Thirumavalavan
Tamil Nadu Politics
Tamil Nadu Assembly Elections
VCK Party
Vijay TVK
DMK ADMK alliance
Tamil Nadu CM Race
Coalition Politics
Tamil political news
Tamil Nadu government formation

More Telugu News