విజయ్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసేవారా?
Add ap7am to your home Screen

విజయ్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసేవారా?

Vijays mistake could have made him CM
  • ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని గవర్నర్ ఆహ్వానించాలి
  • అతిపెద్ద పార్టీగా టీవీకే ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌ను విజయ్ కలవాల్సిందన్న నిపుణులు
  • టీవీకేతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేసిన విజయ్
  • దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని విజయ్ చెప్పినట్లే అంటున్న పరిశీలకులు
  • అందుకే గవర్నర్ మెజారిటీని చూపించమంటున్నారనే అభిప్రాయాలు
  • కేవలం టీవీకే ఎమ్మెల్యేల జాబితా ఇస్తే, అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఉండేదంటున్న నిపుణులు
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు తీవ్ర ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లను గెలుచుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. కాంగ్రెస్ పార్టీ కలిసినప్పటికీ టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేలు (విజయ్ రెండు చోట్ల గెలిచినందువల్ల ఒక స్థానం మాత్రమే లెక్కలోకి వస్తుంది) ఉన్నారు. ఈ నేపథ్యంలో, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనను కలిసిన రెండు సందర్భాలలోనూ, గవర్నర్ మెజార్టీని అడిగారు.

దీంతో కాంగ్రెస్ లాంటి పార్టీలు గవర్నర్ తీరును తప్పుపడుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను పిలవాలని సూచిస్తున్నాయి. అయితే గవర్నర్‌ను కలిసి జాబితాను సమర్పించిన సమయంలో టీవీకే అధినేత విజయ్ చేసిన చేసిన చిన్న పొరపాటు ప్రభుత్వం ఏర్పాటు జాప్యానికి కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయ అనుభవం లేని విజయ్ చేసిన పొరపాటు ప్రభుత్వ ఏర్పాటు అంశానికి కీలక అడ్డంకిగా మారినట్లు కనిపిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రానిపక్షంలో గవర్నర్ ఏకైక అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారు సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి.

మే 6వ తేదీన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసిన విజయ్, టీవీకే ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల జాబితాను కూడా ఆయన సమర్పించడమే విజయ్ చేసిన పొరపాటు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వాస్తవానికి, విజయ్ ముందుగా తన పార్టీ టీవీకేకు చెందిన 108 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను గవర్నర్‌కు సమర్పించాలి. ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన టీవీకే శాసనసభా పక్ష నాయకుడిగా ఆయన గవర్నర్‌ను కలవాల్సి ఉండాల్సిందని చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా చేర్చడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరినట్లయిందని చెబుతున్నారు.

సంకీర్ణ ప్రభుత్వానికి అనుమతి కోరితే 118 మంది ఎమ్మెల్యేల సంతకాలను చూపించాలని అంటున్నారు. విజయ్ తొలుత టీవీకే సభ్యుల సంతకాలతో కూడిన జాబితాను అందజేసి, ఆ తర్వాత అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సిందని అంటున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఉండటంతో గవర్నర్‌ను సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరినట్లయిందని చెబుతున్నారు. అందుకే గవర్నర్ పూర్తి మెజారిటీతో రావాలని స్పష్టం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏకైక అతిపెద్ద పార్టీగా మాత్రమే గవర్నర్ వద్దకు వెళ్లి ఉండే, అప్పుడు విజయ్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సులభమయ్యేదని రాజకీయ విశ్లేషకులు అమిత్ కుమార్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. విజయ్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని భావిస్తున్నారు.

విజయ్ వయస్సు 51. టీవీకే పార్టీ ఎమ్మెల్యేల సగటు వయస్సు 44. విజయ్ బృందంలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు సెంగొట్టయన్ మాత్రమే. ఆయన ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేను వీడి టీవీకేలో చేరారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరిని ఆహ్వానించాలనే విషయంపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాన్ని ఆర్టికల్ 163 గవర్నర్‌కు కల్పిస్తుందని సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ అన్నారు.
Advertisement
Vijay
Tamil Nadu government formation
TVK party
Governor Rajendra Vishwanath Arlekar
Assembly elections

More Telugu News