అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Iran US Tensions Crash Stock Markets
  • అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
  • భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం
  • ప్రారంభ ట్రేడింగ్‌లో 500 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్
  • భగ్గుమన్న ముడి చమురు ధరలు.. భారీగా పెరిగిన బ్రెంట్ క్రూడ్
  • బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఐటీ, ఫార్మాకు లాభాలు
అమెరికా, ఇరాన్ మధ్య నెల రోజుల కాల్పుల విరమణ ఒప్పందం దెబ్బతినడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీయగా, భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు 0.7 శాతం మేర పతనమయ్యాయి.

ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా (0.71 శాతం) నష్టపోయి 77,291.72 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. నిఫ్టీ సైతం 168 పాయింట్లు (0.69 శాతం) క్షీణించి 24,158.15 వద్ద ట్రేడ్ అయింది.

బ్యాంకింగ్, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా కనిపించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కీలక షేర్లు నష్టపోయాయి. అయితే, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు మాత్రం లాభాలతో ట్రేడయ్యాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధర 2.82 శాతం పెరిగి బ్యారెల్‌కు 102.89 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 98.64 డాలర్లకు చేరింది. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లైన నిక్కీ, హ్యాంగ్‌సెంగ్, కోస్పి కూడా 1% వరకు నష్టపోయాయి. గురువారం రాత్రి అమెరికన్ మార్కెట్లు సైతం నష్టాలతోనే ముగిశాయి.
Go Back to Shorts
Iran
Iran US tensions
US Iran conflict
stock markets crash
Indian stock market
Sensex
Nifty
crude oil prices
global markets
West Asia crisis

More Telugu News