విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్' అంటూ నినాదాలు.. వీడియో ఇదిగో!

Mahua Moitra Harassed on Flight Shouted at with Chor Chor Slogans
  • ఇది బీజేపీ సంస్కృతి అని మహువా మొయిత్రా వ్యాఖ్య
  • విమాన సిబ్బంది నిర్లక్ష్యంపై డీజీసీఏకు అధికారిక ఫిర్యాదు
  • ఇండిగో సంస్థపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో డిమాండ్
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రాకు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కిన ఆమెను కొందరు వ్యక్తులు చుట్టుముట్టి 'చోర్ చోర్' అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

గురువారం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కోసం మహువా ఢిల్లీ వెళ్తుండగా ఇండిగో ఫ్లైట్ 6E 719లో ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత, డోర్లు తెరుచుకోకముందే కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని నినాదాలు చేశారని, ఫోన్లలో వీడియో తీశారని ఆమె తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. "చోర్ చోర్, టీఎంసీ చోర్, పిషి చోర్, భాయిపో చోర్" (దొంగలు, టీఎంసీ దొంగ, అత్త దొంగ, మేనల్లుడు దొంగ) అని అరిచారని, 'జై శ్రీరామ్' నినాదాలు కూడా చేశారని వివరించారు.

"ఇది సాధారణ పౌరుల ఆగ్రహం కాదు. విమానంలో నా భద్రతకు భంగం కలిగించేలా జరిగిన వేధింపులు. ఇది బీజేపీ సంస్కృతి" అంటూ మహువా మండిపడ్డారు. మొదట ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా, ఆన్‌లైన్‌లో వీడియో చూసిన తర్వాత స్పందించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.

డీజీసీఏకు ఇచ్చిన ఫిర్యాదులో, కొందరు దుండగులు తనను రాజకీయంగా కించపరిచే ఉద్దేశంతోనే నినాదాలు చేశారని ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని, అనుమతి లేకుండా వీడియోలు తీశారని పేర్కొన్నారు. ఈ సమయంలో విమాన సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. ప్రయాణికుల అసభ్య ప్రవర్తనపై 48 గంటల్లోగా ఇండిగో సంస్థతో ఫిర్యాదు చేయించాలని, విధి నిర్వహణలో విఫలమైనందుకు ఇండిగోకు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆమె డీజీసీఏను కోరారు. ఈ ఘటనపై ఇండిగో సంస్థ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Go Back to Shorts
Mahua Moitra
TMC
Trinamool Congress
Indigo flight
Chor Chor slogans
Delhi
DGCA
BJP culture
Parliamentary Standing Committee
Flight harassment

More Telugu News